Pandas: మీ పాండాలు మాకు వద్దు.. మీరే తీసుకోండి.. పాండాలను చైనాకు తిరిగి ఇచ్చిన ఫిన్నిష్ జూ
పాండాలు (Pandas) చైనాలో పుట్టిన అరుదైన జాతి జంతువులు. చైనా తమ జాతీయ సంపదగా భావించే ఈ పాండాలను ఇతర దేశాలతో మంచి సంబంధాలు పెంచుకోవడం కోసం బహుమతులుగా ఇస్తోంది. అంతర్జాతీయంగా ప్రతిష్ఠను పెంచుకునేందుకు చైనా ఎన్నో దేశాలకు పాండాలను అందజేస్తోంది. ఈ క్రమంలో దాదాపు ఆరేళ్ల క్రితం, చైనా ఫిన్లాండ్‌కు కూడా రెండు పాండాలను ఇచ్చింది. కానీ, పాండాల నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండటంతో, ఫిన్లాండ్ ఇప్పుడు వాటిని తిరిగి చైనాకు పంపిస్తోంది.
పాండాల సంరక్షణ కోసం.. ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ యూరోల ఖర్చు
2018లో, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఫిన్లాండ్‌లో పర్యటించినప్పుడు, పాండాల సంరక్షణపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, లూమీ, పిరీ అనే రెండు పాండాలను ఫిన్లాండ్‌లోని ఒక ప్రైవేట్ జూ కు అప్పగించారు. ఈ పాండాలను 15 సంవత్సరాల పాటు జూలో ఉంచాలని అనుకున్నారు. పాండాల కోసం అవసరమైన వాతావరణం, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు, ఆ ప్రైవేట్ కంపెనీ సుమారు 8 మిలియన్ యూరోలను ఖర్చు చేసింది. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.74 కోట్లు అవుతుంది. ఈ ఖర్చుతో పాటు, పాండాల సంరక్షణ కోసం ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ యూరోలను (రూ.13.8 కోట్లు) ఖర్చు చేయాల్సి వచ్చింది.
కోవిడ్ మహమ్మారి కారణంగా..
పాండాలను ఆకర్షణగా మార్చి పర్యాటకులను ఆకర్షించాలని యోచించిన జూకు కొవిడ్ మహమ్మారితో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది.తీవ్ర ఆర్థిక సమస్యలు తలెత్తాయి. పర్యాటకుల రాక తగ్గిపోవడంతో జూ అప్పుల్లో కూరుకుపోయింది.ఫిన్లాండ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందకపోవడంతో,పాండాల నిర్వహణ భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో,ఫిన్లాండ్ జూ యాజమాన్యం పాండాలను తిరిగి చైనాకు అప్పగించాలని నిర్ణయించింది. దీనిపై చైనాతో జూ యాజమాన్యం చర్చలు జరిపగా..చివరకు ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. పాండాలను మరికొద్ది రోజుల్లో చైనాకు పంపనున్నారు. కానీ, ఆ సమయంలో వాటిని నెల రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. ఇరుదేశాలు ఈ నిర్ణయం పూర్తిగా వ్యాపార సంబంధమైనదని, తమ మధ్య దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశాయి.