Page Loader
Gold Card: గోల్డ్ కార్డు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌.. 
గోల్డ్ కార్డు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌..

Gold Card: గోల్డ్ కార్డు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ఆశించే సంపన్నుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల 'గోల్డ్ కార్డు'ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ గోల్డ్ కార్డ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆయన విడుదల చేశారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్‌ ఈ కార్డును ప్రదర్శించారు. ట్రంప్‌ చిత్రంతో ముద్రించబడిన ఈ గోల్డ్ కార్డును 5 మిలియన్‌ డాలర్ల చెల్లింపు ద్వారా ఎవరైనా పొందవచ్చని ఆయన వెల్లడించారు. అంతేకాక, మొదటగా తానే దీనిని కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. అయితే, రెండో గోల్డ్ కార్డు ఎవరు కొనుగోలు చేస్తారో తెలియదని, ఇది రెండు వారాల్లో పూర్తిగా అమ్ముడుపోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

వివరాలు 

ఒక్కరోజులోనే 1000 కార్డుల విక్రయం 

ఇప్పటికే ట్రంప్‌ ప్రభుత్వం ఈబీ-5 (Investor Visa) వీసా విధానాన్ని రద్దు చేసి, రూ. 43.5 కోట్లు (50 లక్షల డాలర్లు) పెట్టుబడి పెట్టగలిగినవారికి నేరుగా ఈ గోల్డ్ కార్డును అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 5 మిలియన్‌ డాలర్లు చెల్లించినవారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇస్తారని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించడమే దీని లక్ష్యమని, వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు చేస్తే దేశీయంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ గోల్డ్ కార్డుకు భారీగా డిమాండ్ ఉందని, ఒక్కరోజులోనే 1000 కార్డులు విక్రయించినట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా 5 బిలియన్‌ డాలర్లు సమీకరించినట్లు వెల్లడించారు.

వివరాలు 

ఈబీ-5 ప్రోగ్రామ్‌ స్థానంలో గోల్డ్ కార్డు

ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ గోల్డ్ కార్డు కొనుగోలు చేసే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. EB-5 ప్రోగ్రామ్‌ కారణంగా జరుగుతున్న మోసాలు, అక్రమాలను నివారించడమే గోల్డ్ కార్డు లక్ష్యమని తెలిపారు. చట్టబద్ధమైన పెట్టుబడిదారులకు శాశ్వత నివాసం, పౌరసత్వం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. అమెరికా ప్రభుత్వం 1990లో ఈబీ-5 వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. వేలాది మంది ఈ వీసా ద్వారా అమెరికాలో ఇన్వెస్ట్ చేశారు. అయితే, ఈ విధానం ద్వారా మోసాలు జరుగుతున్నాయని, అక్రమంగా నిధులు సమీకరించేందుకు కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఇటీవల జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 2022లో కొన్ని మార్పులు చేశారు. ఇక ఇప్పుడు, ఈబీ-5 ప్రోగ్రామ్‌ స్థానంలో గోల్డ్ కార్డును ట్రంప్‌ ప్రవేశపెట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గోల్డ్‌కార్డ్ ఫస్ట్ లుక్‌ విడుదల