LOADING...
UAE: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్ పడుతుందా? యూఏఈ వేదికగా నేడు త్రైపాక్షిక శాంతి చర్చలు
యూఏఈ వేదికగా నేడు త్రైపాక్షిక శాంతి చర్చలు

UAE: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్ పడుతుందా? యూఏఈ వేదికగా నేడు త్రైపాక్షిక శాంతి చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా మరో కీలక అడుగు పడుతోంది. ఈసారి శాంతి చర్చలు రష్యా-అమెరికా-ఉక్రెయిన్ మధ్య త్రైపాక్షికంగా జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక సమావేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదిక కానుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు యూఏఈలో ఈ చర్చలు నిర్వహించనున్నట్లు దావోస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. మూడు దేశాలు ఒకే వేదికపై చర్చల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

వివరాలు 

జెలెన్‌స్కీ..

రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరుగుతుండటంపై జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలు యుద్ధానికి ముగింపు పలికే మార్గాన్ని చూపుతాయనే నమ్మకం ఉందన్నారు. దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జెలెన్‌స్కీ సుమారు గంటపాటు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ట్రంప్‌తో సానుకూలంగా, లోతైన చర్చలు జరిగినట్లు వెల్లడించారు. గురువారం ఉక్రెయిన్ ప్రతినిధి బృందం ట్రంప్‌తో సమావేశమైందని,అదే సమయంలో అమెరికా బృందం రష్యాకు వెళ్లనుందని జెలెన్‌స్కీ తెలిపారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ తీవ్ర నష్టాన్ని చవిచూసిందని,దేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం, శాంతియుత పరిష్కారం కోసం దౌత్య స్థాయిలో నిరంతర ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. శాంతి చర్చల అంశంపై ట్రంప్‌తో గంటసేపు విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

వివరాలు 

ట్రంప్..

జెలెన్‌స్కీతో భేటీ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని తెలిపారు. యుద్ధం త్వరగా ముగియాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా బృందం త్వరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలవబోతుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఇకపై మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా యుద్ధానికి ముగింపు అవసరమని అన్నారు. తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలని, ఇందుకు పుతిన్, జెలెన్‌స్కీ ఇద్దరూ ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

వివరాలు 

గత ప్రయత్నాలు - ఫలితం లేని చర్చలు

తొలుత సౌదీ అరేబియా వేదికగా అమెరికా ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. అయితే అవి ఫలితాన్ని ఇవ్వలేదు.అనంతరం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగుతూ అలాస్కా వేదికగా పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత వైట్ హౌస్లో జెలెన్‌స్కీతో సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ శాంతి దిశగా స్పష్టమైన ముందడుగు పడలేదు. అనంతరం ట్రంప్ 28 పాయింట్ల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. ఈ ప్రణాళికకు పుతిన్ సమ్మతి తెలపగా,జెలెన్‌స్కీ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు.ఇప్పుడు తాజాగా యూఏఈ వేదికగా జరగనున్న త్రైపాక్షిక సమావేశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఈ చర్చలైనా యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపిస్తాయా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement