Pak fisherman: అదృష్టం అంటే హాజీదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. ఎలాగో తెలుసా?
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఓ మత్స్యకారుడు ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అరుదైన చేపలను వేలం వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఇబ్రహీం హైదరీ మత్స్యకార గ్రామంలో నివసించే హాజీ బలోచ్,అతని కార్మికులు సోమవారం అరేబియా సముద్రం నుండి గోల్డెన్ ఫిష్ లేదా సోవా అని పిలిచే చేపలను పట్టుకున్నారు. కరాచీ హార్బర్‌లో శుక్రవారం ఉదయం మత్స్యకారులు తాము పట్టుకున్న చేపలను వేలం వేయగా, దాదాపు రూ.70 మిలియన్లకు అమ్ముడయ్యిందని పాకిస్థాన్ ఫిషర్మెన్ ఫోక్ ఫోరమ్‌కు చెందిన ముబారక్ ఖాన్ తెలిపారు. సోవా చేప అమూల్యమైనది,అరుదైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దాని బొడ్డు నుండి వచ్చే పదార్థాలు గొప్ప ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
ఈ చేప తూర్పు ఆసియా దేశాలలో చాలా ఎక్కువగా ఉంటుంది
చేపల నుండి దారం లాంటి పదార్థాన్ని శస్త్రచికిత్సా విధానాలలో కూడా ఉపయోగిస్తారు. వేలంలో ఒక చేప సుమారు 7 మిలియన్ రూపాయలు పలికిందని బలోచ్ చెప్పారు. తరచుగా 20 నుండి 40 కిలోల బరువు, 1.5 మీటర్ల వరకు పెరిగే ఈ చేప తూర్పు ఆసియా దేశాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా, సోవా సాంస్కృతిక,సాంప్రదాయిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. సాంప్రదాయ ఔషధాలు, స్థానిక వంటకాల్లో దాని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కరాచీలోని సముద్రంలో మాకు ఈ చేపలు దొరకడం నిజంగానే మా అదృష్టమని హాజీ బలోచ్ తెలిపారు. చేపలు అమ్మగా వచ్చిన డబ్బులను తన ఏడుగురు సిబ్బందితో పంచుకుంటానని హాజీ చెప్పాడు. సంతానోత్పత్తి కాలంలో మాత్రమే చేపలు తీరానికి చేరుకుంటాయి.