Page Loader
US Strikes Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి.. 
ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి..

US Strikes Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2024
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎర్ర సముద్రంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, యునైటెడ్ స్టేట్స్ ఆదివారం యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాలలో ఐదు దాడులు నిర్వహించినట్లు US సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఇది శనివారం మూడు మొబైల్ యాంటీ షిప్‌ క్రూయిజ్‌ మిసైళ్లు, మానవ రహిత ఉపరితల ఓడ, మానవ రహిత జలాంతర్గామిపై దాడులను జరిపినట్లు పేర్కొంది. దాడులు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య (స్థానిక కాలమానం ప్రకారం) జరిగాయి. ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలు, ఇతర దేశాల మధ్య సముద్ర రవాణాకు హౌతీ తిరుగుబాటుదారుల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. తొలిసారిగా హౌతీ రెబెల్స్ మానవరహిత జలాంతర్గాములను సైతం వాడుతున్నారు.

Details 

బ్రిటీష్ చమురు ట్యాంకర్‌పై హౌతీలు క్షిపణి దాడి 

గాజాలోని పాలస్తీనియన్లకు సంఘీభావంగానే ఇజ్రాయెల్‌ నౌకలపైనే దాడులు చేస్తామని మొదట ప్రకటించిన హౌతీ రెబల్స్,అయితే తరువాత ఎర్ర సముద్రం నుంచి వెళ్లే యునైటెడ్ కింగ్‌డమ్, యుఎస్‌తో పాటు ఇతర దేశాల వాణిజ్య నౌకలపైనా వరుసగా దాడులు చేస్తుండటం వల్ల ఆసియా నుంచి అమెరికా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అల్ జజీరా నివేదించింది. US,UK లు యెమెన్‌లోని హౌతీల లక్ష్యాలను అనేకసార్లు చేధించడం ద్వారా ప్రతిస్పందించాయి. హౌతీ దాడులను విచక్షణారహితంగా, ప్రపంచ వాణిజ్యానికి ముప్పుగా వారు అభివర్ణించారు. అంతకుముందు శనివారం,బ్రిటీష్ చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడికి హౌతీలు బాధ్యత వహించారు. ఇది భారతదేశానికి ముడి చమురును తీసుకువెళుతున్న పనామా జెండాతో కూడిన నౌకగా యుఎస్ గుర్తించింది.