
Russia-Ukraine: ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. మాస్కోలో 4 విమానాశ్రయాల మూసివేత!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా తీవ్రంగా కృషి చేస్తున్నా,రెండు దేశాల మధ్య పరస్పర దాడులు మాత్రం ఆగకుండా కొనసాగుతున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా భారీ స్థాయిలో దాడులకు పాల్పడటంతో, కీవ్ తనవంతు ప్రతీకార చర్యలకు దిగుతోంది.
ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ 100కు పైగా డ్రోన్లను ఉపయోగించి మాస్కోలోని ఒక డజను కంటే ఎక్కువ ప్రాంతాలపై విరుచుకుపడింది.
అయితే పలు డ్రోన్లను తాము సమర్థవంతంగా కూల్చివేశామని రష్యా ప్రభుత్వం తెలిపింది.
మాస్కో సమీపంలోని నాలుగు విమానాశ్రయాలు ఈ దాడుల ప్రభావంతో తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చాయని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వివరాలు
మాస్కో బాంబు దాడుల్లో ఏడుగురు పౌరులకు గాయాలు
ఇక మాస్కో ప్రధాన ప్రాంతాల్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా మరో తొమ్మిది ప్రాంతీయ విమానాశ్రయాలకు స్వల్ప నష్టం కలిగిందని, అందువల్ల వాటిని కూడా మూసివేశామని రష్యా పౌర విమానయాన విభాగమైన రోసావియాట్సియా (Rosaviatsia) వెల్లడించింది.
ఇంతలో రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్ పై రష్యా దళాలు 20కి పైగా డ్రోన్లతో దాడి జరిపాయి.
ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. అంతేకాకుండా సుమారు 100 మార్కెట్ స్టాళ్లు నాశనమయ్యాయని సమాచారం.
మరోవైపు మాస్కో బాంబు దాడుల్లో ఏడుగురు పౌరులు గాయపడినట్లు అక్కడి స్థానిక అధికారులు తెలియజేశారు.
వివరాలు
'విక్టరీ డే' వేడుకలకు ప్రపంచ దేశాల నాయకులు
ఈ యుద్ధ పరిస్థితుల నడుమ,రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా సాధించిన విజయాన్ని గుర్తు చేసుకునే 'విక్టరీ డే' 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని,మే 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది.
ఇక ఇటలీలోని వాటికన్ నగరంలో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల సందర్బంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్స్కీ,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య శాంతి చర్చలు జరిగిన విషయం తెలిసిందే.
ఈ చర్చల అనంతరం మాస్కో తన నిర్ణయాన్ని వెల్లడించింది.
ఈ 'విక్టరీ డే' వేడుకలకు ప్రపంచ దేశాల నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకారం, ఈ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.