Loading...
US Flight Cancellations: అమెరికాలో విమాన సర్వీసులకు బ్రేక్.. 6 వేలకుపైగా సర్వీసులు రద్దు
అమెరికాలో విమాన సర్వీసులకు బ్రేక్.. 6 వేలకుపైగా సర్వీసులు రద్దు

US Flight Cancellations: అమెరికాలో విమాన సర్వీసులకు బ్రేక్.. 6 వేలకుపైగా సర్వీసులు రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో విమాన ప్రయాణికుల కష్టాలు ఇంకా తొలగలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం వేలాది విమానాలు రద్దు కాగా.. మరికొన్ని గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. ఆదివారం కూడా పరిస్థితి పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని FAA అధికారులు వెల్లడించారు. ఫ్లైట్‌అవేర్ గణాంకాల ప్రకారం.. శనివారం సాయంత్రం 6.45 గంటల ఈటీ సమయానికి అమెరికాలో 6,150కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 7,300కుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఆదివారం ప్రయాణించాల్సిన విమానాల్లోనూ 530కి పైగా సర్వీసులను ముందుగానే రద్దు చేశారు.

వివరాలు

డెన్వర్ విమానాశ్రయంలో తీవ్ర ప్రభావం

డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

శనివారం అక్కడ 430 విమానాలు ఆలస్యంగా నడవగా.. 380కిపైగా సర్వీసులు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.

విమానాల రద్దు, ఆలస్యాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ అంతరాయంపై FAA చీఫ్ బ్రయాన్ బెడ్‌ఫోర్డ్ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపారు. విమానయాన వ్యవస్థను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఆదివారం చివరి నాటికి విమాన కార్యకలాపాలు చాలావరకు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు విమానాలు, పైలట్లు, ఇతర సిబ్బందిని తిరిగి సర్దుబాటు చేయడం ఎయిర్‌లైన్స్‌కు సవాలుగా మారింది.

వివరాలు

9/11 తర్వాత ఇదే అతిపెద్ద అంతరాయం

శుక్రవారం FAA గ్రౌండ్ స్టాప్ ఆదేశాలు జారీ చేయడంతో అమెరికాలో దాదాపు ఐదు గంటలపాటు విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా విమానయాన రంగంలో ఇంత సుదీర్ఘ అంతరాయం ఏర్పడటం ఇదే తొలిసారి.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలోని హార్డ్‌వేర్ పాతబడిపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అమెరికా రవాణా శాఖ మంత్రి షాన్ డఫీ తెలిపారు.

కొత్త వ్యవస్థ ఏర్పాటుకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది నుంచే కోరుతున్నారని వెల్లడించారు.

అయితే ఈ అంతరాయానికి సైబర్ దాడి కారణం కాదని స్పష్టం చేశారు.

ADVERTISEMENT