అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే
భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో చారిత్రక ప్రసంగం చేశారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. ఒక భారత అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొదటిసారి జూన్ 2016లో మోదీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగంలోని హైలెట్స్‌ను ఓసారి పరిశీలిద్దాం. యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగించడం ఎల్లప్పుడూ గొప్ప గౌరవంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. తనకు రెండుసార్లు అవకాశం దక్కిందన్నారు. భారతదేశం- అమెరికా మధ్య స్నేహాన్ని మరింతగా పెంచుకోవాలనే ఆకాంక్ష ఉందని మోదీ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగంలో మరొక AI (అమెరికా-ఇండియా) మరింత అభివృద్ధిని చూసిందన్నారు.
ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన రాడికలిజం, ఉగ్రవాదం
అమెరికాలో 9/11, ముంబైలో 26/11 దాడుల గురించి కూడా మోదీ ప్రస్తావించారు. రాడికలిజం, ఉగ్రవాదం ఇప్పటికీ మొత్తం ప్రపంచానికి ప్రమాదకరంగా ఉన్నాయని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో 'ఇఫ్స్ లేదా బట్స్' ఉండవన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాడికలిజం, ఉగ్రవాదం సిద్ధాంతాలు కొత్త రూపును మార్చుకున్నా వాటి ఆశయాలు ఒకటేనని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, దాన్ని నియంత్రించడంలో ఎలాంటి అపోహలు ఉండొద్దన్నారు. ఉక్రెయిన్ వివాదంతో ఐరోపాలో మళ్లీ యుద్ధం రాజుకుందని మోదీ అన్నారు. ఈ యద్ధం ఆ ప్రాంతాన్ని తీవ్ర అలజడిని రేపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పినట్లుగా ఇది యుద్ధ యుగం, దౌత్య యుగమని మరోసారి మోదీ నొక్కి చెప్పారు.
త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ప్రధాని మోదీ భారత ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. 2014లో ప్రధాని హోదాలో తాను తొలిసారి అమెరికాను సందర్శించినప్పుడు భారత్ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని చెప్పారు. ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. భారత్ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు, ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ జనాభాలో ఆరోవంతు తాము ఉండటమే దానికి కారణమని మోదీ చెప్పారు. మహిళా సాధికారత గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఆధునిక భారతదేశంలో మహిళలు మంచి భవిష్యత్తు వైపు వెళ్తున్నారన్నారు. మహిళలు ప్రగతి పథంలో నడిపించడం వల్లే సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు.
వేలాది మాండలికాలు ఉన్నా మా స్వరం ఒకటే: మోదీ
ప్రధాని తన ప్రసంగంలో భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విషయంలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మోదీ సమర్థించారు. ప్రజాస్వామ్యం భారతదేశ ఆత్మ అన్నారు. తమ నరనరాల్లో ప్రజాస్వామ్యమే ప్రవరిస్తోందన్నారు. మైనారిటీల పట్ల ఎలాంటి వివక్ష లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తమ దేశంలో 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు ఉన్నాయని, అయితే అందరం ఒకే స్వరంలో మాట్లాడుతున్నామని, ఒకటిగానే ఉన్నామని చెప్పారు. ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు భారత్ నిలయమని, అన్ని వేడుకలను జరుపుకుంటామని పేర్కొన్నారు. తమ జీవన విధానంలో ఎంతో వైవిధ్యం ఉంటుందని మోదీ చెప్పారు. తన పాలనలో భారతదేశంలో ప్రజాస్వామ్యం కుంటుపడిందన్న ఆరోపణలను మోదీ ఖండించారు.
అమెరికా మాకు ముఖ్యమైన రక్షణ భాగస్వామి: మోదీ
అమెరికా నేడు తమ అత్యంత ముఖ్యమైన రక్షణ భాగస్వామ్య దేశాల్లో ఒకటిగా మోదీ పేర్కొన్నారు. భారతదేశం-అమెరికా దేశాలు అంతరిక్షం, సముద్రాలు, సైన్స్, సెమీకండక్టర్లు, స్టార్టప్‌లు, టెక్, వాణిజ్యం, వ్యవసాయం, ఫైనాన్స్, కళ, కృత్రిమ మేథస్సులో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. పారిస్ ఒప్పందాన్ని నెరవేర్చిన ఏకైక జీ20 దేశంగా తాము అవతరించినట్లు మోదీ పేర్కొన్నారు. 'సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్' లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. 150 మిలియన్లకు పైగా ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి తమ ప్రభుత్వం దాదాపు 40 మిలియన్ల ఇళ్లను ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సంఖ్య ఆస్ట్రేలియా జనాభాకు దాదాపు 6 రెట్లు ఎక్కువని చెప్పారు.