Loading...
Baloch Liberation Army: పాకిస్థాన్‌ను సవాల్‌ చేస్తున్న బీఎల్‌ఏ కొత్త కమాండర్‌ ఎవరో తెలుసా?

Baloch Liberation Army: పాకిస్థాన్‌ను సవాల్‌ చేస్తున్న బీఎల్‌ఏ కొత్త కమాండర్‌ ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు అదే దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వేర్పాటువాద సంస్థకు నాయకత్వం వహించబోతున్నాడు. అతనే రెహమాన్‌ గుల్‌. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) కొత్త కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా అతడిని నియమించినట్లు సంస్థ ప్రకటించింది. మురీద్‌ అనే పేరుతో గుర్తింపు పొందిన రెహమాన్‌ గుల్‌ గతంలో బీఎల్‌ఏకు చెందిన మజీద్‌ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించాడు. ఈ విభాగం ప్రధానంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడే సంస్థగా గుర్తింపు పొందింది.

వివరాలు 

ఎనిమిదేళ్లపాటు ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ రెజిమెంట్‌లో పని చేసిన రెహమాన్‌ గుల్

1984 ఆగస్టులో బలూచిస్థాన్‌లోని నుష్కీలో ప్రముఖ మెంగల్‌ కుటుంబంలో రెహమాన్‌ గుల్‌ జన్మించాడు.

2002లో పాకిస్థాన్‌ సైన్యంలో చేరిన అతడు.. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ రెజిమెంట్‌లో పనిచేశాడు.

ఈ సమయంలో వజీరిస్థాన్‌లో పాకిస్థాన్‌ తాలిబన్లకు వ్యతిరేకంగా నిర్వహించిన సైనిక చర్యల్లో పాల్గొన్నాడు.

అయితే 2010లో సైన్యానికి రాజీనామా చేసి, అదే ఏడాది బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీలో చేరాడు.

వివరాలు 

గుల్‌ కుటుంబానికి రాజకీయ,సైనిక నేపథ్యం

అమెరికాకు చెందిన జేమ్స్‌టౌన్‌ ఫౌండేషన్‌ 2025లో ప్రచురించిన ప్రొఫైల్‌లో గుల్‌ గురించి పలు వివరాలు వెల్లడించింది.

పాకిస్థాన్‌ సైన్యంలో పనిచేస్తున్న సమయంలో బలూచ్‌ ప్రజలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని అతడు భావించినట్లు ఆ నివేదిక పేర్కొంది.

ఈ పరిణామాలు అతడిపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. గుల్‌ కుటుంబానికి కూడా రాజకీయ, సైనిక నేపథ్యం ఉంది.

అతడి తల్లి వైపు బంధువుల్లో 1970వ దశకంలో పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన లవాంగ్‌ ఖాన్‌ మెంగల్‌, ప్రముఖ కవి, రాజకీయ నాయకుడు గుల్‌ ఖాన్‌ నసీర్‌ ఉన్నారు.

మరోవైపు అతడి సోదరుడు సరబ్‌ ఖాన్‌ బలూచ్‌ పాకిస్థాన్‌ సైన్యంలో పనిచేస్తున్నట్లు ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ గుర్తించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఏకగ్రీవంగా నిర్ణయం

బీఎల్‌ఏలో చేరిన తర్వాత రెహమాన్‌ గుల్‌ ఖరాన్‌, కలాత్‌ ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించాడు.

అనంతరం సంస్థకు చెందిన మజీద్‌ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించాడు. నవంబర్‌ 3న బషీర్‌ జెబ్‌ తన పదవి నుంచి వైదొలిగినట్లు ప్రకటించిన బీఎల్‌ఏ.. తాజాగా రెహమాన్‌ గుల్‌ను కొత్త అధిపతిగా నియమించింది.

సంస్థకు చెందిన సీనియర్‌ కమాండ్‌ కౌన్సిల్‌ సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జీయాంద్‌ బలూచ్‌ వెల్లడించాడు.

ADVERTISEMENT