Donald Trump: నన్ను గెలిపిస్తే.. ఉచిత IVF చికిత్స: డొనాల్డ్ ట్రంప్
రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కీలక ప్రకటన చేశారు. గెలిస్తే మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్ (IVF) చికిత్స అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే,దీన్ని ఎలా అమలు చేస్తారు? అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. మిషిగన్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో, ''ట్రంప్ పాలనలో ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. లేదా, బీమా కంపెనీలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది'' అని ఆయన ప్రకటించారు. అమెరికాలో ఐవీఎఫ్ చికిత్స ఖర్చుతో కూడుకున్నది. ఒకసారి ప్రయత్నించడానికి దాదాపు పదివేల డాలర్ల వరకు ఖర్చవుతుంది.
రాష్ట్రాలకు గర్భవిచ్ఛిత్తి నియంత్రణ అధికారం
ఫలితాలు తక్కువగా ఉండటంతో, బహుళ సార్లు ప్రయత్నించాల్సి రావచ్చు. 1973లో సుప్రీంకోర్టు రో వర్సెస్ వేడ్ కేసులో అనివార్య పరిస్థితుల్లో గర్భవిచ్ఛిత్తి హక్కు కల్పించగా, గత ఏడాది ఈ తీర్పు రద్దయింది. దీనిపై ట్రంప్ రాష్ట్రాలకు గర్భవిచ్ఛిత్తి నియంత్రణ అధికారాన్ని అప్పగించాలన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహిళా హక్కుల విషయంపై ఆయన కొత్త ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. సంతానలేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ పద్ధతి ఆశాకిరణం. ప్రయోగశాలలో అండం, శుక్రకణాలను ఫలదీకరణ చేసి, అభివృద్ధి చెందిన పిండాన్ని గర్భసంచిలో ప్రవేశపెట్టటం ఇందులో కీలక భాగం. ఐవీఎఫ్ చికిత్సతో గర్భం సాఫల్యం కలిగే అవకాశం తక్కువే అయినప్పటికీ, ఇది కొన్ని సందర్భాల్లో సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది.