Bangladesh: గంగా జలాల వివాదం మళ్లీ తెరపైకి.. భారత్‌తో సంబంధాలపై బంగ్లాదేశ్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం - బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై బంగ్లాదేశ్ మంత్రి మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంఘీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గంగా జలాల భాగస్వామ్య ఒప్పందం పునరుద్ధరణపై ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ప్రజల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా కొత్త నీటి ఒప్పందంపై భారత్‌తో చర్చలు జరగాలని కోరారు. 1996లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య గంగా జలాల పంపిణీ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆ ఒప్పందం 2026 డిసెంబర్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ అంశంపై అధికారికంగా స్పందించింది.
వివరాలు
గంగా జలాల భాగస్వామ్య ఒప్పందంపై ఆధారపడి ఉంది
బీఎన్‌పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగిర్ మాట్లాడుతూ.. "భారత్‌తో సత్సంబంధాలు కొనసాగడం గంగా జలాల భాగస్వామ్య ఒప్పందం లేదా ఫరక్కా ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో కుదిరే నీటి పంపిణీ ఒప్పందాలకు నిర్దిష్ట కాలపరిమితి లేకుండా ఉండాలి" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
గంగా జలాల వివాదం ఏమిటి?
భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా సరిహద్దు దాటిన తర్వాత గంగానది నేరుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఈ నదిని 'పద్మా' పేరుతో పిలుస్తారు. దిగువ దేశమైన బంగ్లాదేశ్‌లో వ్యవసాయం, జీవవైవిధ్యం, తాగునీటి అవసరాలకు ఈ నది అత్యంత కీలకంగా ఉంది. ఇదిలా ఉండగా, ఫరక్కా బ్యారేజ్ నిర్మాణం ద్వారా హుగ్లీ నదిలో నావిగేషన్‌ను మెరుగుపరచడం, కోల్‌కతా పోర్టులో పూడిక తొలగింపునకు సహాయపడటమే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎండాకాలంలో ఫరక్కా బ్యారేజ్ కారణంగా బంగ్లాదేశ్‌కు చేరే నీటి ప్రవాహం తగ్గిపోతోందని ఆ దేశ నిపుణులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల ఉప్పునీటి శాతం పెరిగి వ్యవసాయం, నదీ వ్యవస్థలు, పర్యావరణం దెబ్బతింటున్నాయని చెబుతున్నారు.
వివరాలు
వివాదంగా మారిన 'పద్మా బ్యారేజ్' ప్రాజెక్ట్
ఫరక్కా బ్యారేజ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు పద్మా నదిపై భారీ బ్యారేజ్ నిర్మాణానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టుపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ బ్యారేజ్ నిర్మాణం వల్ల భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని భారత్ వాదిస్తోంది.
వివరాలు
భారత్ స్పందన ఇదే
ఈ నీటి వివాదాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య మొత్తం 54 నదులు ఉన్నాయని, వాటికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇప్పటికే పటిష్టమైన ద్వైపాక్షిక యంత్రాంగం అందుబాటులో ఉందని తెలిపారు. అదే సమయంలో, పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందనే కారణంతో సింధు జలాల ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడిందని కూడా ఆయన పేర్కొన్నారు.