Loading...
Russia nuclear weapons: అంతరిక్షంలో అణు ముప్పు.. రష్యా కదలికలపై జర్మనీ నిఘా!
అంతరిక్షంలో అణు ముప్పు.. రష్యా కదలికలపై జర్మనీ నిఘా!

Russia nuclear weapons: అంతరిక్షంలో అణు ముప్పు.. రష్యా కదలికలపై జర్మనీ నిఘా!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించే దిశగా అగ్రరాజ్యాల మధ్య పోటీ పెరుగుతోంది. ఇప్పటికే అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించినట్లు అమెరికా అంగీకరించగా.. రష్యా కూడా ఈ దిశగా అడుగులు వేస్తోందని జర్మనీకి చెందిన ఓ సంచలన నివేదిక వెల్లడించింది. 2026 చివరి నాటికి అణ్వాయుధంతో కూడిన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు మాస్కో సిద్ధమవుతోందని పేర్కొంది. అదే జరిగితే.. భూకక్ష్యలో అణ్వాయుధాల మోహరింపును, అంతరిక్షంలో అణు పేలుళ్లను నిషేధించే 1963 నాటి పాక్షిక అణు పరీక్షల నిషేధ ఒప్పందం, 1967 నాటి అంతరిక్ష ఒప్పందాలను రష్యా ఉల్లంఘించినట్లవుతుంది. జర్మనీ ఇంటెలిజెన్స్‌ నివేదిక, అక్కడి మీడియా కథనాల ప్రకారం.. కేవలం 60 రోజుల్లోనే అణ్వాయుధాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేలా రష్యా సన్నాహాలు చేస్తోంది.

వివరాలు 

జర్మనీ నివేదికకు మరింత ప్రాధాన్యం చేకూర్చేలా.. రష్యా కథనం 

ఈ వ్యూహాలకు సంబంధించిన సమాచారాన్ని జర్మనీ నిఘా వర్గాలు ఇప్పటికే ఆ దేశ రక్షణశాఖ మంత్రికి అందించినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని జర్మనీ రక్షణశాఖ వెల్లడించింది.

మరోవైపు జర్మనీ నివేదికకు మరింత ప్రాధాన్యం చేకూర్చేలా రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఉక్రెయిన్‌, నాటో సభ్యదేశాలు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాలను మాస్కో పరిశీలించాల్సి వస్తోందని అందులో పేర్కొంది.

రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్‌ దిమిత్రి మెద్వదేవ్‌ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈ కథనాన్ని రూపొందించింది.

అయితే కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అధ్యక్షుడు పుతిన్‌ అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని, జరిగిన నష్టాన్ని బట్టి ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

వివరాలు 

జర్మనీ నివేదికను ఖండించిన రష్యా

జర్మనీ ఇంటెలిజెన్స్‌ నివేదిక గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు.

ఎవరో చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

బెర్లిన్‌లోని రష్యా రాయబార కార్యాలయం కూడా ఈ నివేదికపై స్పందించింది. అందులో చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసింది.

ADVERTISEMENT

వివరాలు 

స్టార్‌లింక్‌ ఉపగ్రహాలే లక్ష్యమా?

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపుపై అమెరికా గతంలోనూ రష్యాపై ఆరోపణలు చేసింది.

శత్రు దేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేసేందుకు మాస్కో ఓ కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని 2024లోనే వెల్లడించింది.

అయితే ఈ ఆరోపణలను అప్పట్లోనే క్రెమ్లిన్‌ ఖండించింది. ఇటీవల మరోసారి అమెరికా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఉక్రెయిన్‌ సైనికులు ఉపయోగిస్తున్న స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ వ్యవస్థకు చెందిన ఉపగ్రహ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయగల అణ్వాయుధాన్ని రష్యా కొన్నేళ్లుగా అభివృద్ధి చేస్తోందని ఆరోపించింది.

ఈ నేపథ్యంలో రష్యా అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించేందుకు సిద్ధమవుతోందంటూ జర్మనీ ఇంటెలిజెన్స్‌ వెల్లడించిన సమాచారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? రష్యా నిజంగానే అణ్వాయుధ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

ADVERTISEMENT