అల్లాడిస్తున్న వేడి గాలులు: అమెరికా సహా పలు దేశాల్లో రెడ్ అలర్ట్
వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులతో ప్రపంచంపై ప్రతికూల ఉష్ణోగ్రత ప్రభావం పడుతోంది. హీట్‌వేవ్స్ కారణంగా గత కొన్నాళ్లుగా ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. అమెరికా ఖండంలో వేడి తీవ్రత పెరిగి, వాతావరణ స్థితిగతులు దిగజారిన పరిస్థితి నెలకొంది. త్వరలోనే ఐరోపా, పశ్చిమ ఆసియా, జపాన్‌లు భారీ ఉష్ణోగ్రత సమస్యను ఎదుర్కొనున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో రెడ్ అలెర్ట్‌లు సైతం జారీ చేయడం ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. అమెరికా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం అల్లాడుతున్నారు. ఇప్పటికే కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు ఉష్ణోగ్రతలు అల్లాడిస్తున్నాయి. ఏసీల్లోనూ చెమటలు చిందించడం తప్పట్లేదని జనం వాపోతున్నారు.
గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో పలు దేశాలకు రెడ్ అలెర్ట్ జారీ
సాధారణం స్థాయిల కంటే ఏకంగా 10 - 20 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అంచనా. మరోవైపు అత్యంత ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఒకటైన కాలిఫోర్నియా డెత్ వ్యాలీలో ఆదివారం 54 డిగ్రీలను తాకొచ్చని అంచనా. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. గ్లోబల్ వార్మింగ్ రెడ్ అలెర్ట్ నేపథ్యంలో యూరోప్ దేశాలు సింసిద్ధం అవుతున్నాయి. ఇటలీ, ఫ్రాన్స్ సహా 16 నగరాల్లో ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఇక ఆసియాలోని జపాన్, భారత్‌లోనూ గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణం మారుతోంది. మెల్లగా ఉష్ణోగ్రతలు మార్పు చెందుతున్నాయి. ఈ దేశాల్లో ఆది, సోమవారం నాటికి 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.