Russia Visa: పర్యాటకులకు శుభవార్త.. 2025 నుంచి రష్యాకు వీసా అవసరం లేదు!
భారతీయ పర్యటకులను ఆకర్షించేందుకు రష్యా ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది. వీసారహిత పర్యటనలకు అనుమతి ఇవ్వాలనే అంశంపై కీలక చర్చలను సాగిస్తోంది. ఈ ఒప్పందాలు కీలక దశలో ఉండగా, 2025 స్ప్రింగ్ సీజన్ నుంచి వీసా-ఫ్రీ సదుపాయం అందుబాటులోకి రాబోతోందని రష్యా ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 28,500 మంది భారతీయులు మాస్కోలో పర్యటించారని మాస్కో సిటీ టూరిజం కమిటీ ఛైర్మన్ ఎవ్జెనీ కోజ్లోవ్ చెప్పారు. ఇది గతేడాది ఇదే సమయంలో ఉన్న సంఖ్యతో పోలిస్తే 1.5 రెట్లు పెరిగిందని ఆయన వివరించారు. వాణిజ్యం, వ్యాపార సంబంధిత ప్రయోజనాల దృష్ట్యా భారత్‌ను కీలక మార్కెట్‌గా అభివర్ణించారు.
అతిథుల కోసం ప్రత్యేకంగా 25వేల గదులు
గత ఆగస్టు 1 నుంచి భారతీయులు రష్యా వెళ్లాలంటే ఈ-వీసా దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా సరళత ఏర్పాట్లు చేశారు. ఈ విధానం ద్వారా 9,500 భారత పర్యటకులకు వీసాలు జారీ అయ్యాయి. మాస్కో అధికారుల ప్రకారం, భారతదేశం గతేడాది అత్యధిక వీసాలు పొందిన మొదటి ఐదు దేశాల్లో నిలిచింది. మాస్కో వాణిజ్య టూరిజం కేంద్రంగా మారుతున్నందున, ప్రతేడాది పండగలు, సమావేశాలు, ప్రదర్శనలు, సదస్సులతో రష్యా ఆకర్షణీయంగా ఉంటుందని అధికారులు తెలిపారు. వీటితో పాటు, భారతీయ వివాహాలకు అనుకూలంగా రష్యా లోని వివిధ ప్రాంతాలను ఎంపిక చేసుకోవడానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అతిథుల కోసం హోటల్ గదుల సంఖ్యను 25,000కి పెంచే ప్రయత్నాలను చేస్తున్నారు.