Trump: శుక్రవారం నాటికి ఇరాన్ చర్చలపై శుభవార్త.. ట్రంప్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోయిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండో దఫా చర్చల విషయంలో శుక్రవారం నాటికి శుభవార్త వెలువడే అవకాశం ఉందని, వచ్చే 36 నుంచి 72 గంటల్లో శాంతి చర్చలు మళ్లీ మొదలయ్యే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన కొన్ని గంటలకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
వివరాలు
అమెరికా ప్రతినిధి బృందం పాకిస్థాన్ ప్రయాణం తాత్కాలికంగా వాయిదా
మధ్యవర్తిత్వం చేపట్టిన పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఇరాన్‌తో కాల్పుల విరమణ గడువును ట్రంప్ పొడిగించారు. దాదాపు ఏడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ నాయకత్వం ఒక సమగ్ర ప్రతిపాదన తీసుకురావడానికి సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 8న ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధి బృందం ప్రయాణం తాత్కాలికంగా వాయిదా పడింది.
వివరాలు
ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధం మాత్రం కొనసాగుతుంది: ట్రంప్
ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో పాటు ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్,జారెడ్ కుష్నర్‌ల బృందం మంగళవారం ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పర్యటన నిలిచిపోయింది. హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు,తమ సరకు నౌకపై దాడి,స్వాధీనం ఘటనలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఇరాన్ పాకిస్థాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపబోమని స్పష్టం చేసింది. ఈపరిస్థితుల్లో పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్,ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకు ఇరాన్ సమగ్ర ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ తెలిపారు. అయితే చర్చలకోసం ఇరాన్ ఒకే విధమైన ప్రతిపాదనను సమర్పించే వరకు మాత్రమే అమెరికా దాడులను ఆపుతుందని,కానీ ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునే విధానం ఇరాన్‌కు తెలుసు: అబ్బాస్ అరాగ్చీ
అమెరికా చర్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా స్పందించారు. నౌకాశ్రయాల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని, ఇది యుద్ధ చర్యగా పరిగణించబడుతుందని అన్నారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునే విధానం ఇరాన్‌కు తెలుసని హెచ్చరించారు. ఇదే సమయంలో ఆసియా ప్రాంతంలో ఇరాన్ ముడి చమురును అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న 'ఎం/టి టిఫానీ' అనే చమురు నౌకను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
వివరాలు
రెండో విడత చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో ఈ యుద్ధం మొదలైంది. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రభావం పెరగడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దాదాపు 30 శాతం పెరిగి, బ్యారెల్ ధర 95 డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండో విడత చర్చలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.