
H1B visa holders: హెచ్1బీ వీసాదారులకు టెక్ దిగ్గజాలు కీలక సూచనలు .
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వలసదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
ఇమ్మిగ్రేషన్ పాలసీ విషయంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న అనిశ్చితి వారిలో ఆందోళనను పెంచుతోంది.
ఈ నేపథ్యంలో టెక్నాలజీ దిగ్గజాలు అయిన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు హెచ్1బీ వీసాదారులను అప్రమత్తం చేశాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
వారు దేశాన్ని వీడొద్దని సూచించాయి, మళ్లీ తిరిగి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందో లేదోనన్న అనుమానాల మధ్య ఈ హెచ్చరికలు వచ్చాయి.
వివరాలు
అమెరికా ప్రవేశంపై భయంతో భారతీయుల ఆందోళన
తిరిగి అమెరికా ప్రవేశాన్ని నిరాకరించవచ్చనే భయంతో తమ భారత్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నామని ఇద్దరు హెచ్1బీ వీసాదారులు మీడియాతో తెలిపారు.
అలాగే, జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఓ భారతీయ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు.
చట్టాన్ని మార్చితే, భవిష్యత్తులో జన్మించే పిల్లలు ఏ దేశ పౌరులుగా గుర్తింపు పొందుతారన్న ప్రశ్న ఆయనను కలవరపాటుకు గురిచేసింది.
అమెరికా పౌరులుగా లేని వారు ఈ దేశంలో అక్రమంగా ఉంటున్నారనే అభిప్రాయం అక్కడి ప్రభుత్వం కలిగి ఉందని మరొకరు అభిప్రాయపడ్డారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికి వెళ్లినా అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవడం చాలా ముఖ్యమని కొందరు వలసదారులు తెలిపారు.
వివరాలు
అమెరికాలో హెచ్1బీ వీసా వ్యవస్థ, వలసదారుల భవిష్యత్తు
హెచ్1బీ వీసా (H-1B Visa) అనేది అమెరికాలో పనిచేయడానికి విదేశీ నిపుణులకు ఇచ్చే తాత్కాలిక వీసా.
ఇది ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు అమెరికా కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి.
ప్రతి ఏడాది లాటరీ విధానంలో 65,000 హెచ్1బీ వీసాలను జారీ చేస్తారు.
ఈ వీసా ద్వారా ఎక్కువగా భారతీయులు అమెరికా ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
విదేశీ నిపుణులలో ఎక్కువ శాతం భారత్, చైనా, కెనడా పౌరులే. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు హెచ్1బీ వీసాదారులను ఎక్కువగా నియమించుకుంటున్నాయి.
వివరాలు
అమెరికా వలస విభాగం కీలక హెచ్చరికలు
ఇటీవల అమెరికా వలస విభాగం (USCIS) కీలక సలహాలను జారీ చేసింది.
హెచ్1బీ, ఎఫ్1, గ్రీన్‌కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
అమెరికాలో ప్రవేశించే, నిష్క్రమించే సమయంలో మరింత కఠిన తనిఖీలు ఉంటాయని తెలిపింది.
విదేశాలకు వెళ్లే వలసదారులు కస్టమ్స్, బార్డర్ అధికారులు అడిగే సుదీర్ఘ ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
తమ పాస్‌పోర్టు, గ్రీన్‌కార్డు, వీసా, రీ-ఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్‌మెంట్ వెరిఫికేషన్ లెటర్, ఫెడరల్ ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపులు, వేతన స్లిప్పులు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
విద్యార్థులైతే సంబంధిత కళాశాల లేదా విశ్వవిద్యాలయం ఇచ్చిన అనుమతి పత్రాలతో పాటు, యూఎస్ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.