Iran: ఇరాన్‌కు యుద్ధ సామగ్రి సరఫరా ఆరోపణలు.. అమెరికాలో మహిళా వ్యాపారవేత్త అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, ఇరాన్‌కు అక్రమంగా బాంబులు, డ్రోన్లు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా వ్యాపారవేత్తను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇరాన్‌కు యుద్ధ సామగ్రి చేరవేయడంలో షమీమ్ మాఫి అనే వ్యాపారవేత్త మధ్యవర్తిగా వ్యవహరిస్తోందని దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఆమెను అరెస్టు చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్‌కు చెందిన 44 ఏళ్ల షమీమ్ మాఫి, అమెరికాలో స్థిరపడి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అక్రమ మార్గాల్లో యుద్ధ సామగ్రి సరఫరా చేసేందుకు ఇరాన్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు.
వివరాలు
70 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం
సైనిక వినియోగానికి ఉపయోగించే డ్రోన్లు, బాంబులు, మందుగుండు సామగ్రి తరలింపులో ఆమె పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. మధ్యవర్తుల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఈ వ్యవహారాన్ని నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇరాన్ రక్షణ విభాగానికి చెందిన మంత్రిత్వశాఖకు మానవరహిత విమానాలైన మొహాజెర్-6 సాయుధ డ్రోన్ల సరఫరా కోసం సుమారు 70 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని షమీమ్ కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే 2023లో ప్రారంభమైన అంతర్గత ఘర్షణల సమయంలో సూడాన్ రక్షణ మంత్రిత్వశాఖకు ఈ నెట్‌వర్క్ ద్వారా 55 వేల బాంబు ఫ్యూజ్‌లు సరఫరా చేసినట్లు కూడా నిందితురాలిపై ఆరోపణలు నమోదయ్యాయి.
వివరాలు
కోర్టులో ఫోన్ కాల్ రికార్డులను సమర్పించిన పోలీసులు
2022 డిసెంబర్ నుంచి 2025 జూన్ వరకు ఇరాన్ మంత్రిత్వశాఖ అధికారులతో షమీమ్ నేరుగా సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ కాల్ రికార్డులను పోలీసులు కోర్టులో సమర్పించారు. అయితే తాను ఎప్పుడూ ఇరాన్ తరఫున మధ్యవర్తిత్వం వహించలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని షమీమ్ ఖండించింది. 2013లో ఇరాన్ నుంచి అమెరికాకు వలస వచ్చిన ఆమెకు 2016లో శాశ్వత నివాస హోదా లభించింది. ఇదిలా ఉండగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రతినిధి బృందం ఇరాన్‌తో పాకిస్థాన్‌లో చర్చలు జరపడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ అరెస్టు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.