Page Loader
H-1B visa: హెచ్-1బీ వీసాలకు తగ్గిన ఆసక్తి… దరఖాస్తుల్లో భారీగా పడిపోయిన సంఖ్య
హెచ్-1బీ వీసాలకు తగ్గిన ఆసక్తి… దరఖాస్తుల్లో భారీగా పడిపోయిన సంఖ్య

H-1B visa: హెచ్-1బీ వీసాలకు తగ్గిన ఆసక్తి… దరఖాస్తుల్లో భారీగా పడిపోయిన సంఖ్య

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ వీసా క్యాప్‌ రిజిస్ట్రేషన్ల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అమెరికా పౌరసత్వ,ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ (USCIS) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈసారి మొత్తం 3.58 లక్షల దరఖాస్తులు మాత్రమే అందాయి. గత ఏడాది నమోదైన 4.78 లక్షల రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఇది దాదాపు 26.9 శాతం తగ్గుదల. ఇక 2024తో పోలిస్తే అయితే ఈ సంఖ్య సగం కంటే ఎక్కువగా, 54 శాతం మేరకు తగ్గిపోయింది.

వివరాలు 

2026 రిజిస్ట్రేషన్ల వివరాలు 

ఈ ఏడాది హెచ్-1బీ వీసా కోసం 1,20,141 దరఖాస్తులు మాత్రమే అర్హత సాధించాయి. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ భారతీయ ఐటీ వర్గానికి ఎంతో కీలకం.అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు ప్రతిభావంతులైన విదేశీ వృత్తిపరుల్ని నియమించుకోవడానికి ఇది ముఖ్యమైన మార్గంగా ఉపయోగపడుతోంది. సంవత్సరానికి 85,000 వీసాలు ఈ ప్రోగ్రామ్‌ కింద జారీ చేయబడతాయి. ఇందులో అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ పొందినవారికి ప్రత్యేకంగా 20,000 సీట్లు కేటాయించబడ్డాయి.

వివరాలు 

డిమాండ్ తగ్గడానికి కారణాలేంటి? 

హెచ్-1బీ వీసాలపై డిమాండ్‌ తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. తాజా విధానాలు, పెరిగిన ఖర్చులు, విదేశీ వృత్తిపరుల కెరీర్ ప్రణాళికల మార్పులు తదితర అంశాలే దీనికి కారణమయ్యాయి. ముఖ్యంగా యూఎస్సీఐఎస్‌ డూప్లికేట్ దరఖాస్తులు, విధానం దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి. "2023, 2024 ఆర్థిక సంవత్సరాల హెచ్-1బీ క్యాప్‌ సీజన్‌ల అనుభవాల ఆధారంగా మేము విస్తృతంగా దర్యాప్తులు చేపట్టాం. పలు పిటిషన్లను తిరస్కరించాం, కొన్నింటిని ఉపసంహరించాం. అవసరమైన చోట్ల క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ కోసం సంబంధిత అధికారులతో కలసి పని చేస్తున్నాం" అని యూఎస్సీఐఎస్‌ అధికారికంగా పేర్కొంది.

వివరాలు 

అప్లికేషన్ ఫీజు పెంపు కూడా కారణమే 

వీసా దరఖాస్తులలో పెరిగిన ఖర్చులు,నియమావళిలో మార్పులు చాలా మందిని దరఖాస్తు చేసుకోవాలన్న ఉత్సాహం తగ్గించాయి. రిజిస్ట్రేషన్‌ ఫీజు ఇప్పటికే 10డాలర్ల నుండి 250 డాలర్లకు పెరిగింది.కెరీర్‌ ప్రారంభ దశలో ఉన్నవారికి ఇది పెద్ద భారం గానే మారింది. యూఎస్సీఐఎస్‌ కూడా "అవసరమైతే పిటిషన్లను తిరస్కరిస్తాం,రద్దు చేస్తాం.కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడము" అని స్పష్టం చేసింది. ఇతర దేశాల వైపు మళ్లుతున్న ఆసక్తి ఇక అమెరికా వైపు కాకుండా ఎక్కువమంది అభ్యర్థులు ఇతర దేశాల అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. చికాగోలో నివసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన పీజీ విద్యార్థి అఫ్తాబ్ బీ ఈ విషయం పట్ల స్పందిస్తూ "ఇప్పుడు చాలా మంది ఆస్ట్రేలియా,జర్మనీ లాంటి దేశాల వైపు కూడా దృష్టి పెడుతున్నారు" అన్నారు.

వివరాలు 

అమెరికాలో అనిశ్చిత పరిస్థితులు 

గ్రీన్‌కార్డ్‌ ప్రక్రియలో దీర్ఘకాలిక ఆలస్యం, హెచ్-1బీపై అధిక ఆధారపడే పరిస్థితి, ఉద్యోగ భద్రతపై ఉన్న అనిశ్చితి — ఇవన్నీ కలిసి అమెరికాలో పరిస్థితిని ప్రతికూలంగా మార్చుతున్నాయి. ఈ మార్పులు భారతీయ విద్యార్థుల విదేశీ విద్యా ప్రణాళికలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో చదువులకు భారతీయ విద్యార్థులను పంపే దేశాల జాబితాలో అమెరికా ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు యూఎస్‌ వైపు అడుగులు వెనక్కి తీసుకుంటున్నారు.