Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ తలపై బుల్లెట్ గాయం..పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు
ఇజ్రాయెల్ సైన్యం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను హతమార్చింది. తాజా సమాచారం ప్రకారం, సిన్వార్ పోస్టుమార్టం రిపోర్టులో ఆతడి మరణానికి సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం నివేదిక ప్రకారం, అతని తలపై బుల్లెట్ గాయం ఉన్నట్లు, ఎడమ చేతికి ఒక వేలు కత్తిరించబడినట్లు వెల్లడించారు. ఆయన బుల్లెట్ గాయంతోనే మరణించినట్లు ధృవీకరించారు. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ నేత సిన్వార్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అతని మృతదేహంపై డాక్టర్ చెన్ కుగేల్ పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం ప్రకారం, తలపై ఉన్న బుల్లెట్ గాయం వల్లే అతను మరణించినట్లు భావిస్తున్నారు. అలాగే, సిన్వార్ ఎడమ చేతికి ఉన్న ఐదు వేళ్లలో ఒక వేలు లేకపోవడం సంచలనంగా మారింది.
ఇజ్రాయెల్ జైలులో రెండు దశాబ్దాల పాటు సిన్వార్
ఇదే సమయంలో, అతని వేలు కత్తిరించడం వెనుక ఉన్న కారణంపై కూడా వార్తలు బయటకు వచ్చాయి. 2011లో ఖైదీల మార్పిడి ఒప్పందం సమయంలో విడుదల అయ్యే వరకు సిన్వార్ ఇజ్రాయెల్ జైలులో రెండు దశాబ్దాల పాటు ఉన్నాడు. ఆ సమయంలో తీసుకున్న డీఎన్‌ఏ వివరాలతో మ్యాచ్ చేయడానికే అతని వేలును కత్తిరించినట్లు సమాచారం. అంతేకాకుండా, అతని దంతాలను కూడా కత్తిరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్ సైన్యం డ్రోన్ రికార్డు
అతను మరణించే ముందు ఉన్న పరిస్థితులను ఇజ్రాయెల్ సైన్యం డ్రోన్ ద్వారా రికార్డు చేసింది. వీడియోలో అతడు ఒక శిథిల భవనంలో సోఫా కుర్చీలో కూర్చొని ఉండటం కనిపించింది. అప్పటికే గాయపడిన అతడి శరీరం నుంచి రక్తం కారుతూ, తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు రికార్డైంది. అంతేకాకుండా,అతను డ్రోన్ వైపు ఒక కర్రలాంటి వస్తువును విసిరిన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.