గాజాపై దాడులను ఆపేస్తే ఇజ్రాయెలీ బంధీలను విడుదల చేస్తాం: హమాస్
పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ తమ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదుల చేయడానికి ఒక షరతుతో ముందుకొచ్చింది. గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులను నిలిపివేస్తే.. అందరు బంధీలను గంటలోపే విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హమాస్ సీనియర్ అధికారి ఎన్‌బీసీ వార్తా సంస్థతో చెప్పారు. గాజా నగరంలోని అల్-అహ్లీ అరబ్ ఆసుపత్రిపై మంగళవారం జరిగిన వైమానిక దాడిలో వందలాది మంది ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హమాస్ బంధీలను విడుదల చేయడానికి షరతులతో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. గాజాలోని అల్-అహ్లీ అరబ్ హాస్పిటల్‌పై మంగళవారం జరిగిన దాడికి బాధ్యత వహించడానికి ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. తాము ఆస్పత్రిపై దాడి చేయలేదని పేర్కొంది.
మారణహోమాన్ని ఆపండి: అంతర్జాతీయ సమాజాన్ని కోరిన పాలస్తీనా
పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ అయిన హమాస్ చేసిన రాకెట్ ప్రయోగం విఫలమైందని ఇజ్రాయెల్ ఆరోపించింది. హమాస్ గ్రూపు ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన రాకెట్ ప్రమాదవశాత్తు ఆస్పత్రి వైపు దూసుకెళ్లినట్లు తమ నిఘా వర్గాలు విశ్లేషించాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ఆసుపత్రిపై మిస్‌ఫైర్డ్ రాకెట్ ప్రయోగానికి హమాస్ బాధ్యత వహిస్తుందని ఐడీఎఫ్ తెలిపింది. ఆసుపత్రిపై జరిగిన దాడిని పాలస్తీనా మారణకాండగా అభివర్ణించింది. ఆసుపత్రిపై దాడి అనంతరం పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందనగా, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. జరుగుతున్నది మారణహోమం అని పేర్కొంది. ఈ మారణహోమాన్ని ఆపడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.