ఒకే రన్‌వే పైకి వచ్చిన 2 విమానాలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
జపాన్ లో ఒకే రన్‌వే పైకి ప్రయాణికులతో కూడిన రెండు విమానాలు పొరపాటున వచ్చాయి. ప్రమాదవశాత్తు ఒకదాన్ని మరోకటి తాకాయి. ఈ ఘటన జపాన్ రాజధాని టోక్యోలో జరిగింది. జపాన్ రాజధాని టోక్యో లోని ఓ ప్రధాన ఏయిర్ పోర్టులో జరిగిన ఈ ఘటనలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. రన్‌వే పై రెండు ప్యాసింజర్ విమానాలు ప్రమాదవశాత్తూ ఒకదాన్ని మరొకటి తాకాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణ నష్టం సంభవించలేదని ఏయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. హనేడా విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనతో రన్‌వే ను ఏయిర్ పోర్ట్ అధికారులు తాత్కాలికంగా మూసేశారు. దేశంలోనే అతి ముఖ్యమైన ఈ ఏయిర్ పోర్టులో మొత్తం నాలుగు రన్‌వేలు ఉన్నాయని అధికారులు వివరించారు.
2 ఫ్లైట్లు పరస్పరం తాకినా ఎవరికీ ఏమీ కాలేదు
హనెేడా విమానాశ్రయంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంకాక్ బయల్దేరిన థాయ్ ఎయిర్‌వేస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఓవైపు, తైపీకి బయల్దేరిన ఇవా ఎయిర్‌వేస్ విమానం మరోవైపు సుమారు 11 గంటల సమయంలో రన్‌వేపైకి ఒకే సమయంలో వచ్చి పరస్పరం ఢీ కొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. ఎవరికీ నష్టం జరగనప్పటకీ, ఓ విమానం రెక్క మాత్రం స్వల్పంగా వంగి ఆ వింగ్ భాగాలు రన్‌వేపై నేలరాలాయి. 2 ఫ్లైట్లను ఒకేసారి రన్‌వే పైకి ఎలా అనుమతించారన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ అంశంపై అటు విమానయాన సంస్థలు గానీ,ఇటు ఎయిర్‌పోర్టు అధికారులు గానీ స్పందించలేదు. దీంతో పలు విమానాల రాకపోకలు ఆలస్యమైనట్టు అధికారులు పేర్కొన్నారు.