తోష్ ఖానా కేసులో ఇమ్రాన్ కు ఊరట..విడుదలైన గంటలోపే మళ్లీ అరెస్ట్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు ఉపశమనం కల్పించింది. తోషాఖానా కేసు తీర్పును సస్పెండ్ చేసి,బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది . ఇమ్రాన్ ఖాన్ తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఇమ్రాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని అటోక్ జిల్లా జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. తాజా హైకోర్టు తీర్పుతో ఇమ్రాన్ జైలు నుంచి విడుదల అవుతారని అనుకునేలోపు ఆయనను సైఫర్ కేసుకు సంబంధించి ఖాన్ మంగళవారం "జుడీషియల్ లాకప్"లో ఉండాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
రాజకీయ లబ్ది కోసంఅధికారాన్ని దుర్వినియోగం చేశాడంటూ ఇమ్రాన్ పై ఆరోపణలు
ఈ విషయమై ఇమ్రాన్ ఖాన్ ను రేపు కోర్టులో హాజరు పర్చనున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు రాజకీయ లబ్ది కోసం రహస్యంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడంటూ ఇమ్రాన్ పై ఆరోపణలు వచ్చాయి. తోష్ ఖానా కేసు నుంచి ఊరట లభించిందని సంబరాలు చేసుకునే లోపే మరో కేసులో అరెస్ట్ చేయడం ఇమ్రాన్ మద్దతుదారులను తీవ్ర నిరాశకు గురిచేసింది.