Russia : రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం
రష్యా తూర్పు ప్రాంతంలో ఉన్న కమ్‌చత్కా ద్వీపకల్పంలో 22 మంది ప్రయాణికులతో బయలుదేరిన హెలికాప్టర్ అదృశ్యమైంది. ఫెడరల్ ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. అదృశ్యమైన ఎంఐ-8టీ శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్‌లో 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. వచ్కజెట్స్ అగ్ని పర్వతం సమీపం నుంచి బయలుదేరిన ఈ హెలికాప్టర్ గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో గాలింపు చర్యలను అధికారులు చేపట్టారు.
హెలికాప్టర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు
డబుల్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ హెలికాప్టర్‌ను 1960లో డిజైన్ చేశారు. ఇది రష్యా, పొరుగు దేశాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా కమ్‌చత్కాలో ఇటువంటి హెలికాప్టర్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా అదృశ్యమైన ఈ హెలికాప్టర్ విట్యజ్ ఏరో కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం హెలికాప్టర్ ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.