LOADING...
Iraq-Syria: యుద్ధ భయాలతో హై అలర్ట్.. గగనతలాన్ని మూసేసిన ఇరాక్, సిరియా
యుద్ధ భయాలతో హై అలర్ట్.. గగనతలాన్ని మూసేసిన ఇరాక్, సిరియా

Iraq-Syria: యుద్ధ భయాలతో హై అలర్ట్.. గగనతలాన్ని మూసేసిన ఇరాక్, సిరియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు అత్యవసర భద్రతా చర్యలకు దిగాయి. భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో తమ దేశాల గగనతలాన్ని (ఎయిర్‌స్పేస్) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరు దేశాల పౌర విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఈ నిర్ణయంతో ఆయా ప్రాంతాల మీదుగా నడిచే అంతర్జాతీయ విమాన సర్వీసులపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.

వివరాలు

ఇరాక్‌లో 72 గంటల పాటు గగనతలం మూసివేత

ప్రాంతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇరాక్ పౌర విమానయాన సంస్థ ఆదివారం రాత్రి నుంచి కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. దేశ వైమానిక పరిధిని పూర్తిగా 72 గంటల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో, ఇరాక్ గగనతలంలో ఒక పౌర విమానం కూలిపోయిందంటూ ప్రచారం జరుగుతున్న వార్తలను అధికారులు ఖండించారు. తమ పరిధిలో అలాంటి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేస్తూ, ప్రజలు వదంతులను నమ్మవద్దని సూచించారు.

వివరాలు

సిరియాలో విమాన కార్యకలాపాల నిలిపివేత

మరోవైపు సిరియా కూడా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి దేశ దక్షిణ వాయు మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్లు సిరియా పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఈ ఆంక్షలు సోమవారం ఉదయం 11 గంటల వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా అన్ని రకాల విమాన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు.

Advertisement

వివరాలు

హై అలర్ట్‌లో ప్రత్యేక కమిటీ

ప్రాంతీయ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఇరాక్, సిరియా అధికారులు వెల్లడించారు. ప్రత్యేక రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ సమర్పించిన సాంకేతిక నివేదికలు, భద్రతా అంచనాల ఆధారంగానే ఈ అత్యవసర నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతతో పాటు విమానాల రక్షణకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే గగనతలాన్ని తిరిగి తెరిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement