
Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ కమ్యూనిటీ నాయకుడు దారుణ హత్య.. కిడ్నాప్ చేసి చంపేశారు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హిందూ సమాజానికి చెందిన ఓ ప్రముఖ నేతను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ హత్యకు ముందు ఆయనను అపహరించి, హింసాత్మకంగా చిత్రవధ చేసి చంపినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన గురువారం చోటుచేసుకున్నా, ఆలస్యంగా ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఢాకాలోని మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఉత్తర బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పుర్ ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల భబేశ్ చంద్ర రాయ్ అనే హిందూ నాయకుడికి గురువారం సాయంత్రం ఓ ఫోన్ కాల్ వచ్చింది.
ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నవిషయం ఫోన్ చేసిన వ్యక్తికి కూడా తెలియజేశారు.
వివరాలు
తీవ్రమైన గాయాలతో భబేశ్ చంద్ర రాయ్
కానీ ఆ అరగంటలోనే నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చి బలవంతంగా ఆయనను తీసుకెళ్లారని భబేశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గాలింపు ప్రారంభించగా, నరబరి గ్రామంలో భబేశ్ చంద్ర రాయ్ తీవ్రమైన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కన్పించారు.
వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించి ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు.
దుండగులు అత్యంత దారుణంగా ఆయనను కొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.