
Nepal Army chief: నేపాల్ ఆర్మీ చీఫ్ వెనుక హిందూ రాజు చిత్రం.. ఇది దేనికి సంకేతం..?
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన 'జెన్ జెడ్' ఉద్యమం, త్వరలో అవినీతిని వ్యతిరేకించే ఉద్యమంగా మారి, చివరికి హింసాత్మక సంఘటనలకు దారితీసింది. ప్రధానమంత్రి పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసినప్పటికీ నిరసనలు ఆగకపోవడంతో, నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. శాంతియుత పరిష్కారానికి చర్చల ద్వారా ప్రయత్నించాల్సిందిగా మంగళవారం నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తున్నప్పుడు అయన వెనుక కనిపించిన ఒక హిందూరాజు ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫొటో ద్వారా ఏదైనా సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
17 ఏళ్ల కాలంలో 14 సార్లు మారిన ప్రభుత్వాలు
ఆ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి 18వ శతాబ్దానికి చెందిన రాజు పృథ్వీ నారాయణ్ షా (Prithvi Narayan Shah). నెటిజన్లు ఈ చిత్రాన్ని ఒక పెద్ద సంకేతం, ఒక స్పష్టమైన ప్రకటనగా భావిస్తూ స్పందిస్తున్నారు. నేపాల్‌ను చివరి వరకు పాలించినది షా రాజవంశమే(Shah dynasty). అయితే, మావోయిస్టుల తిరుగుబాటుతో 2008లో జ్ఞానేంద్ర షా గద్దె వీడడంతో, ఈ హిందూ రాజవంశపాలన ముగిసింది. దాదాపు రెండున్నర శతాబ్దాల పాలన అనంతరం, దేశం ప్రజాస్వామ్య పథంలోకి అడుగుపెట్టింది. అయితే, ఈ 17 ఏళ్ల కాలంలో 14 సార్లు ప్రభుత్వాలు మారడం గమనార్హం. రాజకీయ అస్థిరత, ప్రభుత్వాల అవినీతి, బంధుప్రీతిపై ప్రజలకు విసుగు ఎక్కువయింది.
వివరాలు
నేపాలీస్ ఆర్మీలో నారాయణ్ షాకు ప్రత్యేక స్థానం
ఈ నేపధ్యంలో రాజరిక పునరాగమనంపై చర్చలు మొదలయ్యాయి. ఈ సందర్భంలో ఆ చిత్ర ఫొటో ప్రజల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది రాచరికానికి సంకేతమా..? భవిష్యత్తులో నేపాల్‌కు హిందూ రాజుల పాలన తిరిగి వస్తుందా..? అనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే,రాజకీయ విశ్లేషకులు ఒక ముఖ్య అంశాన్ని గమనించాలని సూచిస్తున్నారు. నేపాలీస్ ఆర్మీలో నారాయణ్ షాకు ప్రత్యేక స్థానం ఉంది. గోర్ఖా ప్రిన్సిపాలిటీలో జన్మించిన నారాయణ్ షా 20 ఏళ్ల వయసులో అధికారాన్ని చేపట్టారు. ఆధునిక నేపాల్ రూపకల్పనలో ఆయన ప్రత్యేక పాత్ర పోషించారు. ఆర్మీకి చెందిన అనేక కార్యక్రమాలు, సంస్థలు, కొన్ని మౌలిక సదుపాయాలు ఆయన పేరు మీదే ఉన్నాయి.
వివరాలు
రాజు పాలనకు మద్దతుగా నేపాల్‌లో ర్యాలీ
గత ఏడాది ఆర్మీ చీఫ్‌గా సిగ్దెల్ బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇలాంటివి బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించాయి. అయితే మళ్లీ ఇది కనిపించడం చర్చకు దారితీసింది. అలాగే,ఈ ఏడాది ప్రారంభంలో, రాజు పాలనకు మద్దతుగా నేపాల్‌లో ర్యాలీ జరిగింది. రాచరికానికి మద్దతు ఇచ్చే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఈ ర్యాలీని నిర్వహించింది. నేపాల్‌లో రాజా పాలనను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఫొటోలను ప్రదర్శించడం గమనార్హం.
వివరాలు
ఇతర దేశ నాయకుల చిత్రాలను ప్రదర్శించినందుకు విమర్శలు
ర్యాలీలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాలను కూడా ప్రదర్శించడం విశేషం. ఆయనకు మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే,ఇతర దేశ నాయకుల చిత్రాలను ప్రదర్శించినందుకు అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. అస్థిర పాలనపై నిరసనలు కొనసాగుతున్నందున జ్ఞానేంద్ర షా తనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు, దాంతోనే ఈ రాచరిక అనుకూల ఉద్యమం రాజుకుంది.