Pakistan: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలలో హిందూ మహిళ నామినేషన్
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునెర్ జిల్లాలో హిందూ సమాజానికి చెందిన డాక్టర్ సవీరా ప్రకాష్, దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా సాధారణ సీటుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు డాన్ నివేదించింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) టికెట్‌పై ప్రకాష్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమె తండ్రి, ఓమ్ ప్రకాష్, రిటైర్డ్ డాక్టర్, గత 35 సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీల సభ్యునిగా ఉన్నారు. క్వామీ వతన్ పార్టీకి సంభందించిన స్థానిక నాయకుడు సలీమ్ ఖాన్ మాట్లాడుతూ, రాబోయే సాధారణ స్థానాల ఎన్నికలకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన బునర్ నుండి ప్రకాష్ మొదటి మహిళ అని చెప్పారు.
జనరల్ సీట్లలో ఐదు శాతం మహిళా అభ్యర్థులు తప్పనిసరి
2022లో అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన ప్రకాష్,బునర్‌లోని PPP మహిళా విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే స్థానిక మహిళల హక్కుల కోసం పాటుపడతానని ఆమె అంటున్నారు.''ఒక వైద్యుడిగా ఈ ప్రాంతంలోని ప్రజలకు మా నాన్న ఎంతో సేవ చేశారు. నేను కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తాను''అని సవేరా ప్రకాశ్ చెప్పారు. డిసెంబర్ 23న తన నామినేషన్ పత్రాలను సమర్పించినట్లు ఆమె తెలిపారు. బునర్ నుండి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఇమ్రాన్ నోషాద్ ఖాన్ సవేరా ప్రకాశ్ కి తన మద్దతును తెలియజేశారు. పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP) చేసిన ఇటీవలి సవరణల ప్రకారం,జనరల్ సీట్లలో ఐదు శాతం మహిళా అభ్యర్థులు తప్పనిసరి చేసింది.