
Imran Khan: 'జైలులో నాకు ఏదైనా జరిగితే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను బాధ్యత': పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నప్పటికీ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మళ్లీ వార్తల్లో నిలిచారు. తనకు జైలులో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్‌దేనని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాల రూపంలో తెలియజేశారు. ప్రస్తుతం తనకు, తన భార్య బుష్రా బీబీకి జైలులో అమానుషమైన, కఠినమైన అనుభవాలు ఎదురవుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 ఆగస్టు నుండి అనేక క్రిమినల్ కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా ఆయన తన అధికారిక 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విషయాలను పంచుకున్నారు.
వివరాలు
అసీమ్ మునీర్ తన భార్యపై వ్యక్తిగత ద్వేషంతో వ్యవహరిస్తున్నారు
పీటీఐ పార్టీ కూడా ఈ ఆరోపణలను అధికారికంగా ధృవీకరించింది. జైలులో తనకు, తన భార్యకు ఎదురవుతున్న వేధింపులు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు. బుష్రా బీబీ ఉన్న సెల్‌లో టీవీని కూడా ఆపివేశారని, ఖైదీలుగా తాము పొందాల్సిన ప్రాథమిక మానవ హక్కులు, చట్టపరమైన హక్కులను పూర్తిగా హరించారని ఆయన వాపోయారు. హంతకులు, ఉగ్రవాదులను కూడా తమ కన్నా మెరుగైన పరిస్థితుల్లో ఉంచుతున్నారని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో అసీమ్ మునీర్ తన భార్యపై వ్యక్తిగత ద్వేషంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆమెను లక్ష్యంగా చేసుకొని తనపై ఒత్తిడి తీసుకురావడమే అసలైన ఉద్దేశమని చెప్పారు. జీవితాంతం జైలులో గడపడానికి తాను సిద్ధమని స్పష్టం చేస్తూ.. నియంతృత్వానికి, అణచివేతకు ఎప్పటికీ తలవంచనని తెలిపారు.
వివరాలు
జైలు సూపరింటెండెంట్ కూడా ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నాడు
అలాగే పాకిస్థాన్ ప్రజలు కూడా భయపడకుండా నిరంకుశ పాలనను ఎదుర్కోవాలని సూచించారు. చర్చల దశ ముగిసిందని.. ఇక నిరసనలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. జైలు సూపరింటెండెంట్ కూడా ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇక మరోవైపు పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. పీటీఐ పార్టీ ఆగస్టు 5 నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వివరాలు
నేను చేసే ప్రతి పోస్టును సోషల్ మీడియాలో రీట్వీట్ చేయండి: ఇమ్రాన్ ఖాన్
ఈ ఉద్యమంలో ప్రతి కార్యకర్త, ప్రతి పార్టీ సభ్యుడు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పాల్గొనాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. తన పోరాటాన్ని ప్రపంచానికి తెలిపేందుకు తాను చేసే ప్రతి పోస్టును సోషల్ మీడియాలో రీట్వీట్ చేయాలని కోరారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, సైనిక జోక్యం, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.