US: అమెరికాలో ఇళ్ల అమ్మకాలు భారీగా పతనం.. 16 ఏళ్ల కనిష్టానికి విక్రయాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా గృహ విక్రయ మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. మార్ట్‌గేజ్ (గృహ రుణ) వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో ఇళ్ల కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. గత 16 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి అమ్మకాలు పడిపోయాయి. అయితే, కొనుగోళ్లు తగ్గుతున్నప్పటికీ ఇళ్ల ధరలు మాత్రం తగ్గకపోవడం మార్కెట్‌లో ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ పరిస్థితి ఇల్లు కొనాలనుకునే వారిని అయోమయానికి గురిచేస్తోంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (ఎన్ఏఆర్) గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అక్టోబర్‌లో పాత ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌తో పోలిస్తే 5.5 శాతం తగ్గాయి. దీంతో వార్షిక విక్రయాల రేటు 3.75 మిలియన్లకు పడిపోయింది.
వివరాలు
అమ్మకాలు తగ్గినా ఆగని ధరల పెరుగుదల.. వరుసగా 40వ నెలలోనూ పైపైకే
గతేడాది అక్టోబర్‌తో పోల్చి చూస్తే అమ్మకాలు 8.8 శాతం తక్కువగా నమోదయ్యాయి. 2010 ఆగస్టు తర్వాత ఇంత తక్కువ స్థాయిలో ఇళ్ల విక్రయాలు జరగడం ఇదే తొలిసారి.
మరోవైపు ఇళ్ల అమ్మకాలు తగ్గుతున్నా ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఇళ్ల సగటు ధర గతేడాదితో పోలిస్తే 0.4 శాతం పెరిగి 4,16,700 డాలర్లకు చేరింది.
ఇలా ఇళ్ల ధరలు పెరగడం వరుసగా 40వ నెల కావడం గమనార్హం. సాధారణంగా డిమాండ్ తగ్గితే ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
కానీ అమెరికా గృహ మార్కెట్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
ఈ పరిణామాలపై ఎన్ఏఆర్ చీఫ్ ఎకనామిస్ట్ లారెన్స్ యున్ స్పందించారు.
వివరాలు
2000 సంవత్సరం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరిన మార్ట్‌గేజ్ వడ్డీ రేట్లే ప్రధాన కారణం
2000 సంవత్సరం తర్వాత మార్ట్‌గేజ్ వడ్డీ రేట్లు ఇంత భారీ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారని తెలిపారు.
దీంతో సామాన్యులకు ఇల్లు కొనడం కష్టంగా మారిందని, ఫలితంగా విక్రయాలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయని వివరించారు.
అమెరికాలోని మిడ్‌వెస్ట్, సౌత్, వెస్ట్ ప్రాంతాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గగా.. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో మాత్రం విక్రయాలు స్థిరంగా కొనసాగాయి.
అమ్మకాలు మందగించడంతో మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులో ఉన్న ఇళ్ల సంఖ్య పెరిగింది.
ప్రస్తుతం 1.59 మిలియన్ల ఇళ్లు అమ్మకానికి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
ఇది ప్రస్తుత విక్రయాల వేగాన్ని బట్టి చూస్తే 5.1 నెలల సరఫరాకు సమానం. అయినప్పటికీ ఇళ్ల ధరలు తగ్గకపోవడం వెనుక కీలక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
అమ్మిన ఇళ్లు కేవలం 2 శాతమే
ఇప్పటికే ఇళ్లు కలిగి ఉన్న యజమానులు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నారని లారెన్స్ యున్ పేర్కొన్నారు.
వారి ఆస్తుల విలువ పెరగడంతో తక్కువ ధరలకు ఇళ్లను విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదని వివరించారు.
మొత్తం ఇళ్ల విక్రయాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మిన ఇళ్లు కేవలం 2 శాతమే ఉన్నాయని తెలిపారు.
వివరాలు
వడ్డీ రేట్లు తగ్గితే డిమాండ్ భారీగా పుంజుకుంటుందని నిపుణుల అంచనా
దీంతో మార్కెట్‌లో ధరలు తగ్గేందుకు అవసరమైన ఒత్తిడి ఏర్పడటం లేదు.
భవిష్యత్తులో మార్ట్‌గేజ్ వడ్డీ రేట్లు తగ్గితే ప్రస్తుతం ఇల్లు కొనుగోలు చేయకుండా వేచి చూస్తున్న వారి నుంచి భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని యున్ అంచనా వేశారు.
దీనినే పెంట్-అప్ డిమాండ్‌గా పేర్కొంటారు. అయితే ప్రస్తుతం అధిక ఇళ్ల ధరలు,రుణాలపై వడ్డీ రేట్ల కారణంగా అమెరికాలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల కొనుగోలు సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని ఆయన వివరించారు.