
Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా ఖండంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశాయి.
హాంకాంగ్‌లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని అక్కడి ఒక అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఇటీవల నిర్వహించిన శాంపిల్స్‌లో చాలా పాజిటివ్‌గా తేలాయని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
మే 3తో ముగిసిన వారంలో మొత్తం 31 కరోనా మరణాలు నమోదు అయినట్లు చెప్పారు. ఈ సంఖ్య 2024లో ఇప్పటివరకు నమోదైన అత్యధికంగా ఉందని స్పష్టం చేశారు.
వివరాలు
మొత్తం 14,200 కొత్త కేసులు నమోదు
అయితే,రెండు సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా ఉద్ధృతి కాలంతో పోల్చితే ఇప్పటి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ,టెస్టింగ్‌లో వైరల్ లోడ్ ఎక్కువగా నమోదవుతోందని అధికారులు గుర్తించారు.
దీని అర్థం వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందన్న సంకేతమని పేర్కొన్నారు.
మరోవైపు సింగపూర్‌లో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
దాదాపు సంవత్సరం తర్వాత అక్కడి ప్రభుత్వం తిరిగి అధికారికంగా కరోనా కేసుల గణాంకాలను వెల్లడించింది.
మే 3తో ముగిసిన వారంలో అక్కడ మొత్తం 14,200 కొత్త కేసులు నమోదయ్యాయని, ఇది మునుపటి వారంతో పోలిస్తే సుమారు 28 శాతం అధికమని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అలాగే ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా 30 శాతం పెరిగిందని వెల్లడించారు.
వివరాలు
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు బూస్టర్ డోసు తీసుకోవాలి
ఇమ్యూనిటీ స్థాయి జనాభాలో తగ్గుతున్న కారణంగా ఈ కేసుల పెరుగుదల జరిగుంటుందనే అనుమానాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న కరోనా వేరియంట్ల వ్యాప్తి సామర్థ్యం గతంతో పోల్చితే ఎక్కువగా లేదని,వ్యాధి తీవ్రత కూడా పెద్దగా మారలేదని చెప్పారు.
హాంకాంగ్,సింగపూర్‌తో పాటు ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
టీకాలు వేయించుకోవాలని,ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు బూస్టర్ డోసు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
సాధారణంగా శ్వాస సంబంధిత వ్యాధుల తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉండేది.
అయితే కరోనా వైరస్ ఎండాకాలంలోనూ వ్యాప్తి చెందుతోందన్న విషయం దృష్టిలో పెట్టుకుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.