
Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని జార్జియాలో ఓ యువతి గర్భవతి అయిన సమయంలో అనారోగ్యం బారినపడి బ్రెయిన్‌డెడ్‌గా మారింది.
అయితే ఆమె కడుపులో పెరుగుతున్న పిండాన్ని రక్షించేందుకు వైద్యులు ఆమెను లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు.
అక్కడి యాంటీ అబార్షన్ చట్టాల ప్రకారం పిండాన్ని తొలగించలేరు కాబట్టి, వైద్యులు చికిత్సను నిలిపివేయడానికి నిరాకరించారు.
బాధితురాలికి సంబంధించిన కుటుంబం నిరసన వ్యక్తం చేస్తున్నా, వారి ఇష్టానికి విరుద్ధంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
అట్లాంటాలో నివసిస్తున్న ఆడ్రియానా స్మిత్ అనే యువతి ఒక నర్సుగా ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు.
ఫిబ్రవరిలో ఆమె తొమ్మిదో వారంలో గర్భవతిగా ఉండగా, తరచూ తలనొప్పులతో బాధపడింది.
వివరాలు
లైఫ్ సపోర్ట్‌పై స్మిత్
దీంతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించగా,వారు కేవలం మందులు మాత్రమే ఇచ్చారని,ఎలాంటి స్కానింగ్ లేదా పరీక్షలు చేయలేదని ఆమె తల్లి ఏప్రిల్ న్యూకిర్క్ వెల్లడించారు.
"వారు పరీక్షలు చేసినట్లయితే అసలు సమస్య ముందుగానే తెలుస్తుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె మరింత అనారోగ్యానికి లోనయ్యింది. అందుచేతనే ఆమె పనిచేస్తున్న ఎమోరీ హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. అక్కడ స్కాన్ చేసినప్పుడు మెదడులో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించి, వైద్యులు ఆమె బ్రెయిన్‌డెడ్‌గా మారిందని తెలిపారు" అని ఆమె తల్లి వివరించారు.
ఆ సమయంనుంచి స్మిత్‌ను లైఫ్ సపోర్ట్‌పై ఉంచారు.జార్జియా రాష్ట్రంలో అమలులో ఉన్న అబార్షన్ చట్టాల ప్రకారం,గర్భంలో శిశువు హృదయం కొట్టుకుంటూ ఉంటే,అబార్షన్ చేయడం చట్టవిరుద్ధం.
వివరాలు
శిశువు వయసు 21 వారాలు
ఈ నిబంధనను 'హార్ట్‌బీట్ లా'గా పిలుస్తారు. దీంతో ఆడ్రియానా స్మిత్ కుటుంబానికి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం గర్భంలో ఉన్న శిశువు వయసు 21 వారాలు.
"ఇది నాకెంతో బాధాకరం. నా కళ్ళముందు నా కుమార్తె పడుకొని ఉంది. కానీ నిజానికి ఆమె అక్కడ లేదు," అంటూ ఆమె తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు.
శిశువు బయట ప్రపంచాన్ని తట్టుకునే స్థితికి వచ్చే వరకు స్మిత్‌ను లైఫ్ సపోర్ట్‌పై ఉంచుతామని వైద్యులు చెప్పారు.
వివరాలు
మహిళకు తన జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు
"ప్రతి మహిళకు తన శరీరానికి సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కు ఉండాలి. ఆమె భాగస్వామి లేకపోతే కనీసం ఆమె కుటుంబసభ్యులు అంటే తల్లిదండ్రులకి ఆ హక్కు ఉండాలి. ఇక్కడ మా ఉద్దేశం గర్భాన్ని తొలగించాలన్నదేం కాదు. కానీ ఎంచుకునే అవకాశమైనా ఉండాలి. ఇప్పుడు మేము పుట్టబోయే బిడ్డకు ఎలా జీవితం ఉండబోతుందో అనుకున్నప్పుడు భయంగా ఉంది," అని ఏప్రిల్ న్యూకిర్క్ ఆవేదన వ్యక్తం చేశారు.