Loading...
Saudi Arabia: చమురు ఎగుమతులపై హౌతీల పట్టు.. పాక్‌ దూరంతో సౌదీకి కొత్త చిక్కులు
చమురు ఎగుమతులపై హౌతీల పట్టు.. పాక్‌ దూరంతో సౌదీకి కొత్త చిక్కులు

Saudi Arabia: చమురు ఎగుమతులపై హౌతీల పట్టు.. పాక్‌ దూరంతో సౌదీకి కొత్త చిక్కులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ చమురు మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపే సౌదీ అరేబియా ఇప్పుడు ఊహించని భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఎర్ర సముద్ర తీరంలోని కీలక ప్రాంతాలతో పాటు బాబ్ ఎల్‌ మండేబ్ జలసంధిలో హౌతీలు పట్టు సాధించినట్లు సమాచారం. దీంతో సౌదీ చమురు ఎగుమతులపై ప్రభావం పడే అవకాశాలు పెరిగాయి. ఒకవైపు హౌతీల ముప్పు..మరోవైపు మిత్రదేశాల నుంచి ఆశించిన స్థాయిలో ప్రత్యక్ష సైనిక సహకారం అందకపోవడం రియాద్‌కు ఇబ్బందికర పరిస్థితిని సృష్టించినట్లు తెలుస్తోంది. సౌదీ మిత్రదేశమైన పాకిస్థాన్‌..యెమెన్‌లో హౌతీలపై నేరుగా పోరాడేందుకు తమ బలగాలను పంపబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో అధికారిక దౌత్య సంబంధాలు లేని ఇజ్రాయెల్‌ నుంచి కూడా పరోక్షంగా సాయం కోరినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

అమెరికా సెంట్రల్ కమాండ్ మధ్యవర్తిత్వంతో చర్చలు?

టెల్ అవీవ్‌కు చెందిన 'ది జెరూసలెం పోస్ట్' కథనం ప్రకారం.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియా,ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

హౌతీల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సహాయం కోరినట్లు తెలుస్తోంది.

మరోవైపు 'ఇజ్రాయెల్ హయోమ్' కథనం ప్రకారం.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) ఇతర గల్ఫ్ దేశాలతో పాటు ఈజిప్ట్‌ నుంచి కూడా సహాయం కోరినట్లు సమాచారం.

సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేని నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

యెమెన్‌లో రియాద్ ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ పరిణామాలు సూచిస్తున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

వివరాలు 

అసలు సంక్షోభం ఏంటి?

అందుబాటులో ఉన్న ప్రతి దౌత్య, భద్రతా మార్గాన్ని సౌదీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వరకు సౌదీ ఇంధన మౌలిక వసతులపై అప్పుడప్పుడు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిన హౌతీలు.. గత వారం అనూహ్యంగా పెద్ద ఎత్తున దాడికి దిగినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

సౌదీ మద్దతున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను వెనక్కి నెట్టి.. ఎర్ర సముద్ర తీరంలోని విస్తారమైన ప్రాంతాలతో పాటు బాబ్ ఎల్‌ మండేబ్ జలసంధిలోని కొన్ని ద్వీపాలపై హౌతీలు నియంత్రణ సాధించినట్లు సమాచారం.

బాబ్ ఎల్‌ మండేబ్ జలసంధి సౌదీకి వ్యూహాత్మకంగా కీలకమైనది.

ఇరాన్ ఆధిపత్యంలో ఉన్న హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకునే అవకాశం ఈ ప్రాంతం ద్వారా ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

అసలు సంక్షోభం ఏంటి?

ఇప్పుడు ఈ మార్గంపైనా ముప్పు ఏర్పడటంతో సౌదీ చమురు ఎగుమతులపై ఆందోళన పెరిగింది.

ఇప్పటికే జులై నుంచి సౌదీ నౌకలపై ఆంక్షలు కొనసాగిస్తున్న హౌతీ నాయకత్వం.. ఈ నిర్బంధాన్ని కొనసాగిస్తామని ప్రకటించినట్లు కథనాలు చెబుతున్నాయి.

ఇతర దేశాల నౌకలకు మాత్రం రాకపోకలకు అనుమతిస్తామని పేర్కొన్నట్లు సమాచారం.

మరోవైపు సౌదీకి చెందిన కీలక పైప్‌లైన్ వ్యవస్థలపై కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. చమురు ఉత్పత్తిపైనే కాకుండా దాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు తరలించే సామర్థ్యంపైనా ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

పాక్‌ ఎందుకు వెనక్కి?

సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మధ్య ఏర్పడిన మక్కా డిఫెన్స్ అలయన్స్ నేపథ్యంలో ఇస్లామాబాద్ నుంచి సైనిక సహాయం అందుతుందని రియాద్ ఆశించినట్లు కథనాలు సూచిస్తున్నాయి.

అయితే యెమెన్‌లో హౌతీలపై పోరాటానికి తమ బలగాలను పంపే విషయంలో పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం.

సౌదీ భూభాగాన్ని రక్షించేందుకు మాత్రం తమ బలగాలను మోహరించవచ్చని పాకిస్తాన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అయితే విదేశీ గడ్డపై జరిగే ప్రత్యక్ష యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనబోమని ఇస్లామాబాద్ స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు కథనాలు చెబుతున్నాయి.

వివరాలు 

అమెరికా, బ్రిటన్‌ కూడా దూరం

హౌతీలపై ప్రత్యక్ష సైనిక చర్య విషయంలో అమెరికా, బ్రిటన్ కూడా వెనుకంజ వేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

అమెరికా ఇంటెలిజెన్స్ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. యెమెన్‌లో హౌతీలపై నేరుగా దాడులు చేయబోమని స్పష్టం చేసినట్లు సమాచారం.

బ్రిటన్ కూడా సైనిక సలహాదారులను అందించే దిశగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనే విషయంలో ఆ దేశాల వైఖరి పరిమితంగానే ఉన్నట్లు కథనాలు సూచిస్తున్నాయి.

వివరాలు 

ఇజ్రాయెల్‌ సాయం ఎంతవరకు?

ఇజ్రాయెల్‌ నుంచి సౌదీకి అందే సహాయం కూడా ప్రధానంగా ఇంటెలిజెన్స్‌కే పరిమితం కావచ్చని 'ఇజ్రాయెల్ హయోమ్' కథనం పేర్కొంది.

హౌతీలు ఇజ్రాయెల్ నగరాలపై రాకెట్లతో దాడులు చేసే ప్రమాదం ఉండటంతో.. యెమెన్‌లో ప్రత్యక్ష సైనిక చర్యకు ఇజ్రాయెల్ కూడా పరిమితులు విధించుకునే అవకాశం ఉందని సమాచారం.

హౌతీలకు వ్యతిరేకంగా ఏదైనా చర్య తీసుకోవాల్సి వస్తే.. ఇజ్రాయెల్ ఒంటరిగా కాకుండా విస్తృత అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమిలో భాగంగా ఆ చర్యను చేపట్టాలని ఆ దేశ రక్షణ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.

దీంతో సౌదీకి ఇజ్రాయెల్ నుంచి లభించే సహాయం ఏ స్థాయిలో ఉంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT