
US-China Tariffs: 'మా వద్ద అన్ని ఆయుధాలున్నాయ్'..: డోనాల్డ్ ట్రంప్ 104% సుంకాలపై చైనా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలను మరింతగా ఉధృతం చేశారు.
బీజింగ్ తమ హెచ్చరికలను పట్టించుకోకపోవడాన్ని గుర్తించి, ట్రంప్ ప్రభుత్వం చైనా వస్తువులపై మొత్తం 104 శాతం టారిఫ్‌లు విధించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి లోనయ్యాయి.
ఇక ఈ నేపథ్యంలో, అమెరికా విధించిన ఈ సుంకాలపై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తీవ్రస్థాయిలో స్పందించారు.
ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనడానికి చైనా ప్రభుత్వం అన్ని విధానపరమైన ఆయుధాలను సిద్ధంగా ఉంచిందని ఆయన పేర్కొన్నారు.
ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డియర్‌తో జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా లీ కియాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
అంతర్జాతీయ వాణిజ్య నియమాలను సంరక్షించేందుకూ మా పోరాటం సాగుతుంది: లీ కియాంగ్
"సుంకాల పేరిట అమెరికా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. దీనిపై మేం చివరివరకు పోరాడతాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను మేము రూపొందించుకున్నాం. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ఏకపక్షత, రక్షణవాద విధానం, ఆర్థికపరమైన ఒత్తిళ్లను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. వీటికి మేము సమర్థవంతంగా ప్రతిస్పందన ఇస్తాం. ఇది కేవలం మా జాతీయ ప్రయోజనాల కోసం మాత్రమే కాదు, అంతర్జాతీయ వాణిజ్య నియమాలను సంరక్షించేందుకూ మా పోరాటం సాగుతుంది," అని లీ కియాంగ్ స్పష్టం చేశారు.
ఇదివరకే డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలు తమ దేశానికి వస్తువులను ఎగుమతి చేస్తూ, అదే సమయంలో అధిక సుంకాలు విధించి తమ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
వివరాలు
చైనా వస్తువులపై అమెరికా విధించిన మొత్తం సుంకాలు 104 శాతం
ఈ నేపథ్యంలో అన్ని దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించనున్నట్టు ఇటీవల ట్రంప్ ప్రకటించారు.
గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం టారిఫ్‌ను అమలు చేస్తూ వచ్చింది.
అనంతరం అదనంగా పెరిగిన సుంకాలతో కలిపి ఈ రేటు 54 శాతానికి చేరుకుంది.
దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ,అమెరికా నుంచి దిగుమతి చేసే వస్తువులపై 34 శాతం అదనపు సుంకాన్ని విధించాలని నిర్ణయించింది.
దీనికి ప్రతిస్పందనగా ట్రంప్,బీజింగ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మరింత కఠినమైన టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు.
అయితే చైనా వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా మరో 50శాతం అదనపు సుంకాలను ప్రకటించింది.
ఫలితంగా ఇప్పుడు చైనా వస్తువులపై అమెరికా విధించిన మొత్తం సుంకాలు 104 శాతానికి పెరిగాయి.