
దద్దరిల్లిన సిరియా.. బాంబు పేలుడుతో ఆరుగురు దుర్మరణం, 20 మందికిపైగా గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
సిరియాలో బాంబుల మోతతో రాజధాని డమాస్కస్ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మహమ్మద్ ప్రవక్త మనవరాలు, ఇమామ్ అలీ కుమార్తె సయీదా జీనాబ్ సమాధి నుంచి కేవలం 600 మీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది. భద్రతా భవనం సమీపంలోనే ఈ పేలుడు చోటు చేసుకున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
రాజధాని ప్రాంతానికి దక్షిణంగా ఉన్న షియా ముస్లిం మందిరానికి సమీపంలో అషురాకు 24 గంటల ముందు బాంబు పేలింది. ఈ క్రమంలోనే క్షతగాత్రుల కోసం ఆగమేఘాల మీద అంబులెన్సులు తరలివచ్చాయి.
ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికిపైగా గాయాలపాలయ్యారు.
ప్రభావిత ప్రాంతానికి చేరుకున్న అధికారులు, హుటాహుటిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. దాడి తీవ్రతతో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
details
దాడులకు పాల్పడింది ఉగ్రవాదలే : సిరియా అధికారులు
తీవ్ర బాంబు దాడులకు పూనుకుంది ఉగ్రవాదలేనని సిరియా అధికారులు నిర్థారించారు. మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు టాక్సీలో బాంబు పెట్టడంతోనే ఈ భారీ పేలుడు చోటు చేసుకున్నట్లు స్టేట్ టెలివిజన్ తెలిపింది.
మసీదు ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో అషురా వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఆకస్మికంగా పెద్దపెట్టున శబ్దం రావడంతో అక్కడికి వచ్చిన జనం పరుగులు తీశారని స్థానికులు పేర్కొన్నారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. అనంతరం తమ అధీనంలోకి తీసుకున్నట్లు స్థానిక వాసులు వివరించారు.
సయీదా జీనాబ్ సమాధిని సిరియాలోని అత్యధిక ప్రజానీకం సందర్శించే షియా పుణ్యక్షేత్రం. అఘరా అంటే ఇస్లామిక్ నెల ముహర్రం 10వ రోజు. షియాలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఇదొ ఒకటి.