Page Loader
Trump: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నేను తగ్గించా.. ట్రంప్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు!
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నేను తగ్గించా.. ట్రంప్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు!

Trump: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నేను తగ్గించా.. ట్రంప్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని తానే ఆపినట్లు వెల్లడించారు. ఇటీవల రిపబ్లికన్ శాసనసభ్యులకు ఇచ్చిన ఓ ప్రైవేట్ విందు కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్, ఇరు అణుశక్తులు తలపడిన ఆ యుద్ధాన్ని తానే నిలిపి వేసినట్టు చెప్పారు. వాణిజ్య మార్గాల ద్వారానే భారత్-పాకిస్థాన్ ల మధ్య సమస్య పరిష్కారానికి దారి తీసినట్లు వివరించారు. అంతేకాకుండా ఆ నాలుగు రోజుల యుద్ధంలో ఐదు జెట్ ఫైటర్లు కూలిపోయాయని చెప్పారు. అయితే అవి ఎక్కడ కూలాయి? ఏ దేశానికి చెందినవని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఇతరుల క్రెడిట్‌ను తీసుకోవడంలో ముందుండే ట్రంప్‌ ఈసారి కూడా అదే పద్ధతిని అనుసరించినట్లు అనిపిస్తోంది.

Details

మూడో వ్యక్తి పాత్ర లేదు : భారత్

గతంలోనూ భారత్ ఇప్పటికే అనేకసార్లు ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. ఇరు దేశాల మధ్య చర్చల వల్లే కాల్పుల విరమణ జరిగిందని, మూడో వ్యక్తికి ఇందులో ఏమాత్రం పాత్ర లేదని భారత్ బహిరంగంగా స్పష్టం చేసింది. ఇక ట్రంప్ తన ప్రసంగంలో, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ స్వయంగా వైట్‌హౌస్‌కు వచ్చి తనకు నోబెల్ శాంతి బహుమతికి మద్దతు తెలిపారని చెప్పారు. అణుశక్తులు కలిగిన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు తనదే కీలక పాత్రగా పేర్కొన్నారు. గతంలో రష్యా-ఉక్రెయిన్‌, ఇరాన్-ఇజ్రాయెల్‌, హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల విషయంలో కూడా తానే వాటిని తగ్గించానంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.

Details

నోబెల్ బహుమతిపై ఇంకా ఆశలు

తాజాగా భారత్-పాకిస్థాన్ ఉదంతాన్ని కూడా అదే కోవలో చేర్చారు. నోబెల్ బహుమతిపై ఆయన ఆశలు ఇంకా కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది. పాక్, ఇజ్రాయెల్ ఇప్పటికే ట్రంప్‌కు మద్దతు ప్రకటించగా, భారత్ మాత్రం ఇప్పటికీ ఆయన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి చోటుచేసుకుంది. దానికి ప్రతీకారంగా మే 7న భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరిట భారీ యుద్ధ కార్యాచరణ ప్రారంభించింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి.