US: 'అక్రమ వలసదారులకు ఉరి కాదు, కాల్చి చంపడం సరైన శిక్ష'.. రిపబ్లిక్ అభ్యర్థి సంచలన వీడియో
అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్నారు. వారిని బహిష్కరించడం కాదు, కాల్చి చంపడం సరైన శిక్ష అని రిపబ్లికన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాలెంటినా గోమెజ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె ఈ వీడియోలో డమ్మీ తుపాకీతో కుర్చీలో కట్టిన డమ్మీ నల్ల బ్యాగ్ తలపై కాల్చుతూ, "అక్రమ వలసదారులకు ఇదే శిక్ష" అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో వైరల్‌గా మారి, అమెరికా అంతటా నిరసనలు రేకెత్తించింది. గోమెజ్ తన ఈ వివాదాస్పద వీడియోను మంగళవారం X లో పోస్ట్ చేశారు. కొలంబియాకు చెందిన గోమెజ్, డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారు కావడం విశేష.
వీడియోపై తీవ్ర విమర్శలు
ఈ వీడియోలో నల్ల బ్యాగ్‌తో కుర్చీకి కట్టబడి ఉన్న డమ్మీ తలపై తుపాకీ పెట్టి కాల్చుతూ కనిపించారు. అక్రమ వలసదారులను చంపడమే సరైన పరిష్కారమంటూ ఆమె క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలోని పెద్ద సంఖ్యలో ప్రజలు గోమెజ్ వ్యాఖ్యలను ఖండించారు. "వీడియో రెచ్చగొట్టేలా ఉంది, ప్రమాదకరమైనదంటూ సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోమెజ్ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 5 లక్షల మంది చూడగా, X నిబంధనలు ఉల్లంఘించిందని గుర్తించి వీడియోను తొలగించడంతో పాటు గోమెజ్‌పై జరిమానా కూడా విధించారు.
దౌత్యపరమైన చర్చలకు దారితీసిన వీడియో
ఇటీవల న్యూయార్క్ నగరంలో ఓ మహిళ హత్య కేసు ఈ పరిస్థితికి ఆజ్యం పోసింది. గ్వాటెమాలన్ జాతీయుడిపై ఆ హత్య కేసు నమోదు చేయగా, అది గోమెజ్ ఈ వీడియో విడుదల చేయడానికి కారణమైంది. ఈ వివాదాస్పద వీడియో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలకు దారితీసింది. వలసదారులపై ఈ విధమైన హింసాత్మక ఆలోచనలను సమర్థించడం కరెక్ట్ కాదని అంతర్జాతీయంగా స్పందనలు వ్యక్తమయ్యాయి.