Taiwan: తైవాన్ చుట్టూ 103 చైనా యుద్ధ విమానాల మోహరింపు
తైవాన్‌పై ఆదిపత్య చలాయించేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో తైవాన్ సరహద్దుల వెంబడి యుద్ధ విమానాలన మోహరిస్తూ నిత్యం ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో తైవాన్ ద్వీపం చుట్టూ 103 చైనా యుద్ధ విమానాలను తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తించింది. చైనా సైనిక కార్యకలాపాలను పెంచడంపై తైవాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 17, 18వ తేదీ ఉదయం మధ్య జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం 103 చైనీస్ విమానాలను గుర్తించింది. చైనా సైనిక వేధింపులు ఉద్రిక్తతకు దారితీస్తాయని, ప్రాంతీయ భద్రతను మరింత దిగజారుస్తాయని తైవాన్ అభిప్రాయపడింది. ఇటువంటి విధ్వంసక ఏకపక్ష చర్యలను వెంటనే ఆపాలని చైనాకు సూచించింది.
తైవాన్‌ను ఒంటరి చేసేందుకు చైనా కుట్ర
తైవాన్‌కు సొంత ప్రభుత్వం, సైన్యం, రాజ్యాంగం ఉన్నప్పటికీ, చైనా మాత్రం ఆ దేశ ప్రభుత్వాన్ని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలని చూస్తోంది. చైనా ఏకీకరణే లక్ష్యంగా ఆ దేశ ప్రభుత్వం పనిచేస్తోంది. చైనా ప్రావిన్స్ నుంచి తైవాన్ తాత్కాలికంగా విడిపోయిందని చైనా వాదిస్తోంది. శాంతియుత మార్గాల ద్వారా లేదా అవసరమైతే బలవంతంగా అయినా చైనా నుంచి విడిపోయిన తైవాన్‌ను మళ్లీ కలుపుకుంటామని బీజేపీ చెబుతోంది. తైవాన్‌ను ప్రత్యేక దేశంగా అధికారికంగా గుర్తించవద్దని ఇతర దేశాలపై ఒత్తిడి చేయడం ద్వారా దౌత్యపరంగా తైవాన్‌ను ఒంటరి చేయాలని బీజింగ్ భావిస్తోంది. అయినప్పటికీ, అనేక దేశాలు తైవాన్‌తో సంబంధాలను కొనసాగిస్తున్నాయి.