LOADING...
Epstein Files: ఎప్‌స్టీన్‌ స్కాండల్‌పై ట్రంప్‌ యూ-టర్న్‌: అమెరికా రాజకీయాల్లో సంచలనం
ఎప్‌స్టీన్‌ స్కాండల్‌పై ట్రంప్‌ యూ-టర్న్‌: అమెరికా రాజకీయాల్లో సంచలనం

Epstein Files: ఎప్‌స్టీన్‌ స్కాండల్‌పై ట్రంప్‌ యూ-టర్న్‌: అమెరికా రాజకీయాల్లో సంచలనం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో పెద్ద వివాదానికి కారణమైన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ స్కాండల్‌ ఫైల్స్‌(Epstein Files)విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశ్చర్యకరంగా యూ-టర్న్‌ తీసుకున్నారు. ఈకేసుకు సంబంధించిన పత్రాలను ప్రజల్లోకి విడుదల చేసే బిల్లుకు హౌస్‌ రిపబ్లికన్లు మద్దతు ఇవ్వాలని ఆయన కోరడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇంతకుముందు ఇదే విషయాన్ని వ్యతిరేకించిన ట్రంప్‌ అకస్మాత్తుగా వైఖరి మార్చుకోవడం అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. "దాచిపెట్టాల్సింది ఏమీలేదు''అంటూ ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ అయిన ట్రూత్‌ సోషల్‌లో ప్రకటించారు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వివాదం అనేది రిపబ్లికన్‌ పార్టీ విజయాలను మళ్లించడానికి 'రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లు' సృష్టించిన నకిలీ కథ అని ఆయన వ్యాఖ్యానించారు. రిపబ్లికన్లు తిరిగి అమెరికా ప్రయోజనాలపై దృష్టిపెట్టాలని కూడా సూచించారు.

వివరాలు 

రిపబ్లికన్లలో అంతర్గత విభేదాలు 

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను పబ్లిక్‌ చేయాలన్న ఆలోచన రిపబ్లికన్‌ పార్టీలోనే అంతర్గత చీలికలకు దారితీసింది. ట్రంప్‌కు అత్యంత సమీపంగా ఉండే జార్జియా ప్రతినిధి మార్జోరీ టేలర్‌ గ్రీన్‌ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ట్రంప్‌ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం స్పష్టంగా కనిపించడంతోనే ట్రంప్‌ తన అభిప్రాయం మార్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తన సొంత పార్టీలో అభ్యంతరాలు వచ్చిన సందర్భాలు ఉన్నా... ఇలా పూర్తిగా తిరగబడడం ఆయనకు చాలా అరుదైన విషయం.

వివరాలు 

హౌస్‌లో త్వరలో ఓటింగ్ 

ఈ వారంలోనే ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ బహిర్గతం చేయడంపై హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌స్లో ఓటింగ్ జరగనుంది. ట్రంప్‌ మొదట వ్యతిరేకించినప్పటికీ, పెద్ద సంఖ్యలో రిపబ్లికన్లు బిల్లుకు అనుకూలంగా ఓటువేస్తారని అనుచరులు అభిప్రాయపడుతున్నారు. కెంటకీ ప్రతినిధి థామస్ మాస్సీ మాట్లాడుతూ—దాదాపు వందమంది లేదా అంతకంటే ఎక్కువ రిపబ్లికన్లు ఈ బిల్లుకు ఓటు వేయవచ్చని చెప్పారు. వీటో వచ్చే అవకాశం ఉంటే దాన్ని తిరస్కరించేంత మెజారిటీ కూడా రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మాస్సీతో పాటు కాలిఫోర్నియా ప్రతినిధి రో ఖన్నా కలిసి ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు గతంలోనే 'డిశ్చార్జ్‌ పిటిషన్‌' దాఖలు చేసిన విషయం తెలిసిందే.

వివరాలు 

ట్రంప్‌కు సంబంధం ఉందా? 

ఎప్‌స్టీన్‌ కేసు పత్రాలలో ట్రంప్‌ పేరు కూడా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్‌స్టీన్‌తో పరిచయం ఉన్నా—ట్రంప్‌ ఎలాంటి తప్పు చేయలేదని వైట్‌హౌస్‌, స్పీకర్‌ జాన్సన్‌ స్పష్టంచేశారు. ఇంతలో 2019 నాటి ఒక ఈమెయిల్‌ బయటపడింది. అందులో ట్రంప్‌కు "ఆ అమ్మాయిల విషయం తెలుసు'' అని రాసి ఉండటం మరోసారి చర్చకు దారితీసింది. ఎప్‌స్టీన్‌ స్కాండల్‌ అసలు కథ ఎప్‌స్టీన్‌ (Epstein) నడిపిన సెక్స్‌ కుంభకోణం అమెరికాను ఒకప్పుడు షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. పేద,మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ డబ్బు వాగ్దానం చేస్తూ ఫ్లోరిడా, న్యూయార్క్‌, వర్జిన్‌ ఐలాండ్స్‌, మెక్సికోలోని తన విలాసవంతమైన ఇళ్లకు పిలిపించి లైంగిక దాడులకు పాల్పడేవాడన్నది ప్రధాన ఆరోపణ.

వివరాలు 

ఈ చీకటి వ్యవహారం 2005లో బయటపడింది

బాధితులకి కొంత మొత్తం ఇచ్చి, మరో యువతిని తీసుకురమ్మని చెప్పి అదనంగా కమీషన్‌ ఇస్తానని ప్రలోభపెట్టిన విషయాలూ అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. దాదాపు 20 సంవత్సరాలుగా సాగుతున్న ఈ చీకటి వ్యవహారం 2005లో బయటపడింది. అప్పుడు ఎప్‌స్టీన్‌ను అరెస్టు చేసి కొంతకాలం జైలులో ఉంచారు. 2019లో 'మీటూ' ఉద్యమం నేపథ్యంలో తాజా ఫిర్యాదులు రావడంతో అతడిని మళ్లీ అరెస్టు చేశారు. అదే ఏడాది ఆగస్టులో అతడు జైల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. దానిని అధికారులు ఆత్మహత్యగా తేల్చారు. ఎప్‌స్టీన్‌కి అత్యంత సన్నిహితురాలైన మాక్స్‌వెల్‌ ఈ వ్యవహారంలో సహకరించినందుకు ఇప్పటికే 20ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తోంది.