
Trump tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లను మినహాయింపు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల అంశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు వంటి ప్రాముఖ్యమైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రతీకార సుంకాల నుంచి మినహాయించనున్నట్టు తెలిపారు.
ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఈ పరిణామం ద్వారా ఆపిల్, శాంసంగ్ వంటి అగ్రగామి కంపెనీలతో పాటు అమెరికన్ వినియోగదారులకు కూడా ఉపశమనం లభించే అవకాశముంది.
ఇటీవల ట్రంప్ ప్రభుత్వం చైనాకు మినహా ఇతర దేశాలపై విధించిన సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కానీ చైనాపై మాత్రం 145 శాతం భారీ సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రకటించారు.
వివరాలు
అమెరికా తయారీ ఉత్పత్తులపై 125 శాతం సుంకం
దీని ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికా తయారీ ఉత్పత్తులపై 125 శాతం సుంకాన్ని విధించనున్నట్టు వెల్లడించింది.
ఈ పరస్పర నిర్ణయాలతో అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.
యాపిల్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులలో చాలా భాగాన్ని చైనాలో తయారు చేస్తున్న నేపథ్యంలో, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దీంతో ధరలు పెరిగే భయంతో స్థానిక మార్కెట్లలో ప్రజలు భారీగా కొనుగోళ్లకు ఎగబడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
వివరాలు
చైనాపై అమలవుతున్న 145శాతం సుంకం వీటికి వర్తించదు
ప్రతీకారసుంకాల నుంచి మినహాయించబడ్డ ఉత్పత్తులలో స్మార్ట్‌ఫోన్లు,కంప్యూటర్లు,హార్డ్ డ్రైవ్‌లు, కంప్యూటర్ ప్రాసెసర్లు,మెమొరీ చిప్‌లు,సెమీ కండక్టర్లు,సోలార్ సెల్స్, ఫ్లాట్ టీవీ డిస్‌ప్లేలు వంటి వస్తువులు ఉన్నాయి.
అంటే చైనాపై అమలవుతున్న 145శాతం సుంకం వీటికి వర్తించదు.
అయితే ఇవి పూర్తిగా సుంకాలు మినహాయింపు పొందినట్టు కాదు..వాటిపై వేరే రకాల సుంకాలు ఉంటాయని కస్టమ్స్ శాఖ స్పష్టం చేసింది.
వాస్తవానికి ఈరకమైన మినహాయింపును పొందాలంటే ఆయా ఉత్పత్తులు అమెరికాలోనే తయారవ్వాల్సి ఉంటుంది.
అయితే ఇది సాధ్యమయ్యే వరకు కొంతకాలం పట్టే అవకాశం ఉంది.ఈకారణంగా తాత్కాలికంగా ఈ ఉత్పత్తులను మినహాయిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఈప్రతీకార సుంకాల నేపథ్యంలో అత్యధికంగా నష్టపోయిన కంపెనీగా యాపిల్ పేరు చెబుతారు. దీంతో తాజామినహాయింపు నిర్ణయం యాపిల్‌కి గుడ్ న్యూస్ అనేచెప్పాలి.