నిజ్జర్ హత్య విచారణకు సహకరించాలని భారత్‌ను కోరిన అమెరికా
భారతదేశం-కెనడా దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని "బహిరంగంగా, ప్రైవేట్‌గా" కోరినట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది. విచారణ తప్పక కొనసాగుతుందని, నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని అమెరికా కోరింది. తన రోజువారీ వార్తా సమావేశంలో స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కెనడా ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు ముఖ్యమని చెప్పారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలతో మేము తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. తమ కెనడియన్ భాగస్వాములతో టచ్ లో ఉన్నట్లు మిల్లెర్ పేర్కొన్నారు. కెనడా చేస్తున్న దర్యాప్తునకు భారత్ సహకరించాలని తాము బహిరంగంగా.. ప్రైవేట్‌గా - అభ్యర్దించినట్లు ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
నిజ్జర్ హత్యకు సంబంధించిన దోషులను గుర్తించేందుకు అమెరికా డిమాండ్
నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం ఉందని కెనడా గతంలో ఆరోపించింది. ఈ వాదనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరో పక్క, కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న US హౌస్ సభ్యుడు జిమ్ కోస్టా కూడా కెనడియన్ సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన దోషులను గుర్తించేందుకు దర్యాప్తు జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆయన ఎక్స్ లో స్పందిస్తూ.. ''"కెనడియన్ సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైనట్లు వచ్చిన నివేదికల గురించి నేను చాలా ఆందోళన చెందాను. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ సభ్యునిగా నేను అధికారిక బ్రీఫింగ్‌ను అభ్యర్థించాను. ఈ నేరంపై మనం కచ్చితంగా దర్యాప్తు చేపట్టి దోషులను బాధ్యులుగా చేయాలి'' అని పేర్కొన్నారు.
జస్టిన్ ట్రూడో ఆరోపణల తరువాత దౌత్యపరమైన ఉద్రిక్తతలు
ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో "భారత ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రమేయం" గురించి కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల తర్వాత కెనడా, భారతదేశం మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. జూన్‌లో సర్రేలో నిజ్జర్ హత్యకు గురయ్యాడు. భారతదేశం ఈ ఆరోపణలను "నిరాధారమైనవి", "రాజకీయ ప్రేరేపితమైనవి" అని కొట్టిపారేసింది. ఇరు దేశాలు తమ దేశాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ దౌత్యవేత్తలను కూడా బహిష్కరించాయి. అమెరికా వంటి దేశాల జోక్యంతో ఈ సమస్య ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.