Loading...
Trump New Tariffs: భారత్‌తోపాటు 16 దేశాలపై అమెరికా కొత్త టారిఫ్‌లు?
భారత్‌తోపాటు 16 దేశాలపై అమెరికా కొత్త టారిఫ్‌లు?

Trump New Tariffs: భారత్‌తోపాటు 16 దేశాలపై అమెరికా కొత్త టారిఫ్‌లు?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
07:58 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి దిగుమతి సుంకాల పెంపునకు సిద్ధమవుతోంది. భారత్, చైనా సహా 16 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే వస్తువులపై కొత్త టారిఫ్‌లు విధించే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన గత సుంకాల స్థానంలో కొత్త విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్,వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్‌జే) కథనాలు వెల్లడించాయి. మంగళవారం నుంచే కొత్త సుంకాలకు సంబంధించి వాషింగ్టన్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. చైనా,యూరోపియన్ యూనియన్ (ఈయూ) సహా 16 దేశాల్లో అమలవుతున్న పారిశ్రామిక రాయితీలపై అమెరికా కొంతకాలంగా దర్యాప్తు చేస్తోంది.

వివరాలు 

ప్రభుత్వ రాయితీలే ప్రధాన కారణం

ఈ విచారణకు సంబంధించిన నివేదికను అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) జేమిసన్ గ్రీర్ ఈ వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

తమ దేశాల్లోని కంపెనీలకు ప్రభుత్వాలు భారీగా రాయితీలు అందిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది.

దీంతో ఆయా సంస్థలు తక్కువ ధరలకు వస్తువులను తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నాయని చెబుతోంది.

ఫలితంగా అమెరికాలోని తయారీ సంస్థలు పోటీని తట్టుకోలేక నష్టపోతున్నాయని వాషింగ్టన్ అభిప్రాయపడుతోంది.

ఈ నేపథ్యంలో రాయితీలపై దర్యాప్తు చేపట్టి, సంబంధిత దేశాలపై అదనపు దిగుమతి సుంకాలు విధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

వివరాలు 

భారత్, వియత్నాంపై అధిక టారిఫ్‌ల ముప్పు

కొత్త ప్రతిపాదనల్లో భాగంగా యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 15 శాతం లేదా అంతకంటే తక్కువ సుంకాలు విధించే అవకాశం ఉందని న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది.

అయితే భారత్, వియత్నాంపై మాత్రం అంతకంటే ఎక్కువ స్థాయిలో టారిఫ్‌లు విధించే అవకాశముందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

చైనాపై మిగతా దేశాలతో పోలిస్తే అత్యధిక సుంకాలు ఉండొచ్చని అంచనా వేస్తోంది.

అయితే భారత్‌పై ఖచ్చితంగా ఎంత శాతం దిగుమతి సుంకం విధిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

అమెరికా అధికారిక ప్రకటన వెలువడితేనే దీనిపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త వ్యూహం

2026 ఫిబ్రవరిలో ట్రంప్ ప్రభుత్వం గతంలో విధించిన భారీ దిగుమతి సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది.

దీంతో ఆ నిర్ణయంతో ఏర్పడిన పరిస్థితిని అధిగమించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

ఇందులో భాగంగా ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 వంటి చట్టపరమైన నిబంధనలను ఉపయోగించి కొత్త టారిఫ్‌లను అమలు చేయాలని భావిస్తోంది.

ఈ సుంకాలు లక్ష్యంగా ఎంచుకున్న దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అనేక రకాల వస్తువులకు వర్తించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

కొన్ని రంగాలకు మినహాయింపు ఉండొచ్చు

అయితే ఇప్పటికే జాతీయ భద్రతా కారణాలతో ప్రత్యేక దిగుమతి సుంకాలు ఎదుర్కొంటున్న కొన్ని రంగాలకు కొత్త టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్ వంటి ఉత్పత్తులను కొత్త సుంకాల జాబితా నుంచి తప్పించే యోచనలో అమెరికా ఉన్నట్లు సమాచారం.

తుది టారిఫ్‌ల శాతాలు, అమలు నిబంధనలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే భారత్‌పై పడే ప్రభావం స్పష్టమవుతుంది.

ముఖ్యంగా భారత ఎగుమతి రంగాలు, అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన వ్యాపార సంస్థలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT