UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలలో సంస్కరణల కోసం భారతదేశం పిలుపు
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ 1965 నుంచి ఎటువంటి ప్రధాన మార్పులు లేవని ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో జరిగిన జనరల్ అసెంబ్లీ ప్లీనరీ సమావేశంలో ఈ అంశాన్ని హరీష్ గుర్తు చేశారు. భారత్‌కి శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఆయన కోరారు.
యూఎన్ భద్రతా మండలిలో సంస్కరణలు కీలకం
''ఈ సంవత్సరం చర్చలు ప్రారంభించినప్పుడు, యూఎన్ భద్రతా మండలిలో సంస్కరణలు అత్యంత కీలకమని మేం స్పష్టంగా చెప్పాం. భవిష్యత్తులో జరిగే శిఖరాగ్ర సమావేశంలో ఈ అంశాన్ని అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ, దశాబ్దాలుగా ఈ అంశంపై చర్చలు జరిగినప్పటికీ ఎటువంటి పరిష్కారం కానందుకు ఆశ్చర్యంగా ఉంది. ..1965లో కౌన్సిల్ చివరిసారి నాన్-పర్మనెంట్ విభాగంలో మాత్రమే విస్తరించబడింది. సంస్కరణలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆటంకాలు మూడు: అంతర్-ప్రభుత్వ చర్చల అప్రయోజక ప్రక్రియ, కొన్ని దేశాలు ఏకాభిప్రాయాన్ని మాత్రమే పట్టుకోవడం, గ్లోబల్ సౌత్‌కి తగిన ప్రాతినిధ్యం లేకపోవడం.
చర్చలు మాటలకే పరిమితం
..అంతర్-ప్రభుత్వ చర్చలు ప్రారంభమైన నాటి నుండి చర్చలు మాటలకే పరిమితం అయ్యాయి; సరైన ముగింపు కోసం ఎటువంటి లక్ష్యం లేదు. కొన్ని దేశాల ఏకాభిప్రాయం అని చెప్పటం అంటే మార్పులకు విరుద్ధంగా ఉండే దేశాలు తమ అభిప్రాయాన్ని ముందుకు తెస్తున్నాయి. గ్లోబల్ సౌత్ సభ్యునిగా, కేవలం కౌన్సిల్ మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి చట్టబద్ధత, ప్రభావం రెండింటికీ ప్రాతినిధ్యం అవసరమని మేము నమ్ముతున్నాం'' అని హరీష్ అన్నారు.