India-US Tariffs: అమెరికా ఆల్కహాల్ సహా కొన్ని ఉత్పత్తులపై భారత్ 150శాతం సుంకాలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన శ్వేతసౌధం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ సహా అనేక దేశాలపై భారీ ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గందరగోళాన్ని పెంచింది.
ఈ నేపథ్యంలో, తాజా సమాచారం ప్రకారం వైట్‌హౌస్ (White House) మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా నుంచి అనేక దేశాలు అధిక స్థాయిలో టారిఫ్‌లు (Tariffs) వసూలు చేస్తున్నాయని, ముఖ్యంగా భారత్ (India) తమ ఆల్కహాల్, ఇతర ఉత్పత్తులపై 150% సుంకాలను విధిస్తోందని వెల్లడించారు.
మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అధ్యక్షుడు (Donald Trump) తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు.
వివరాలు
బియ్యంపై జపాన్ 700% సుంకం
''ట్రంప్ పరస్పర చర్యను నమ్ముతారు. దేశాల మధ్య పారదర్శకత,సమతుల వాణిజ్య విధానాలు ఉండాలని ఆశిస్తారు.కెనడా అనేక దశాబ్దాలుగా అధిక సుంకాలు విధిస్తూ అమెరికాను నష్టపరిచింది. అమెరికా నుండి ఎగుమతి అయ్యే ఛీజ్,బటర్‌పై పొరుగుదేశం 300% టారిఫ్ వసూలు చేస్తోంది.అలాగే, భారత్,జపాన్ వంటి దేశాలు కూడా అధిక సుంకాలను అమలు చేస్తున్నాయి.భారతదేశం అమెరికా మద్యంపై 150% సుంకాన్ని విధిస్తోంది.అలాంటప్పుడు కెంటుకీ బోర్బన్ (Kentucky Bourbon-అమెరికా ఆల్కహాల్ బ్రాండ్)ను భారతదేశానికి ఎగుమతి చేయడం ఏమంత లాభదాయకం?అదేవిధంగా, వ్యవసాయ ఉత్పత్తులపై న్యూఢిల్లీ 100% టారిఫ్ వసూలు చేస్తోంది.జపాన్ మన బియ్యంపై 700% సుంకాన్ని విధిస్తోంది. అందుకే అధ్యక్షుడు పరస్పర సుంకాలను అమలు చేయాలని నిర్ణయించుకున్నారు'' అని కరోలిన్ పేర్కొన్నారు.
వివరాలు
కెనడా ఉక్కు,అల్యూమినియంపై 50% టారిఫ్
భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తున్నందున ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీ ప్రతీకార సుంకాలను అమలు చేయబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాంగ్రెస్ సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు.
ఇదే సమయంలో, చైనా,ఇతర దేశాలపై కూడా టారిఫ్‌లు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
అంతేగాక, మెక్సికో,కెనడాపైనా మార్చి 4 నుంచి ఈ సుంకాలను అమలు చేయగా,కొన్ని ఉత్పత్తులకు ఏప్రిల్ 2 వరకు మినహాయింపు ఇచ్చారు.
మరోవైపు, కెనడా ఉక్కు,అల్యూమినియంపై ప్రస్తుతం ఉన్న 25% టారిఫ్‌లను 50% వరకు పెంచారు.
విద్యుత్‌పై సుంకాలను విధించనున్నట్లు ఆంటారియో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ ప్రకటనల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.