LOADING...
Russina Oil: రష్యా చమురు దిగుమతులకు భారత్‌కు అమెరికా మినహాయింపు.. 30 రోజుల ప్రత్యేక అనుమతి
30 రోజుల ప్రత్యేక అనుమతి

Russina Oil: రష్యా చమురు దిగుమతులకు భారత్‌కు అమెరికా మినహాయింపు.. 30 రోజుల ప్రత్యేక అనుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాపై ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. యుద్ధ పరిస్థితుల్లో కూడా రష్యా చమురు (Russian Oil)ను దిగుమతి చేసుకునేందుకు భారత్‌ (India)కు అమెరికా ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ 'ఎక్స్‌' (X) వేదికగా వెల్లడించారు.

వివరాలు 

భారత్‌ అమెరికాకు ఒక కీలక భాగస్వామి

భారతదేశంలోని శుద్ధి కర్మాగారాలు రష్యా చమురును కొనుగోలు చేయడానికి తాత్కాలికంగా 30 రోజులపాటు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు బెసెంట్‌ తెలిపారు. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సముద్రంలో నిలిచిపోయి ఉన్న రష్యా నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు జరపాలని స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల రష్యాకు ఆర్థికంగా పెద్దగా లాభం కలగదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా భారత్‌ అమెరికాకు ఒక కీలక భాగస్వామి అని స్కాట్‌ బెసెంట్‌ వ్యాఖ్యానించారు. అలాగే భవిష్యత్తులో భారత్‌ తమ దేశం నుంచి ముడి చమురు కొనుగోళ్లను మరింత పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

వివరాలు 

ప్రపంచ ఇంధన రవాణాలో అంతరాయం

2022 నుంచి భారత్‌ రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులు చేస్తోంది. అయితే ఆంక్షలు,అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కారణంగా ఇటీవల ఈ దిగుమతులు కొంత తగ్గాయి. ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించడం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. దీంతో ప్రపంచ ఇంధన రవాణాలో అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర బ్యారెల్‌కు 83 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Advertisement