
India-Bangladesh: మహ్మద్ యూనస్‌కి భారత్ షాక్.. బంగ్లాదేశ్‌లో కీలక రైలు ప్రాజెక్టుల నిలిపివేత..
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి భారత్ షాక్ ఇచ్చింది.
భారత్ ఇప్పటికే ఆ దేశంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టును నిలిపివేసింది.ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాలు రాజకీయ అస్థిరతతో పాటు కార్మికుల భద్రత పట్ల ఉన్న అనిశ్చితి.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఇప్పుడు ఆ ప్రాంతంలో స్థిరత్వం, వ్యూహాత్మక భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది.
ఇదే సమయంలో, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం తప్పుకున్న తరువాత యూనస్ పాలన ప్రారంభమైనప్పటి నుంచి హిందూ మైనారిటీలు తీవ్ర దాడులకు గురవుతుండగా, భారత్ వ్యతిరేకత కూడా అక్కడ విస్తృతమవుతోంది.
అంతేకాదు, యూనస్ సర్కార్ పాకిస్తాన్, చైనాలతో సంబంధాలను మరింతగా పెంచుకోవడం కూడా భారతాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాలు
ప్రాజెక్టుల కోసం దాదాపు రూ. 5,000 కోట్ల వరకు ఖర్చు
భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పటికే నిర్మాణంలో ఉన్న కీలకమైన అఖౌరా-అగర్తల రైల్వే లింక్, ఖుల్నా-మోంగ్లా రైలు ప్రాజెక్టులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
అంతేకాకుండా ఢాకా-టోంగి-జోయ్దేబ్‌పూర్ రైలు విస్తరణ పనులపై కూడా ఈ ప్రభావం పడనుంది.
ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు రూ. 5,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. వీటితో పాటు, మరో ఐదు ప్రాజెక్టులను కూడా భారత్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో యూనస్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు, ఆయన చేసిన వ్యాఖ్యలు భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆందోళనకు గురి చేశాయి.
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్‌గా ఉన్నాయని,వాటికి బంగాళాఖాతానికి కనెక్టివిటీ కల్పించేది బంగ్లాదేశ్ మాత్రమేనని యూనస్ వ్యాఖ్యానించారు.
వివరాలు
బంగ్లాదేశ్‌కి ఇస్తున్న ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని వెనక్కి తీసుకున్న భారత్
చైనా బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెడితే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యల తర్వాత భారత్, బంగ్లాదేశ్‌కి ఇప్పటివరకు ఇస్తున్న ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని వెనక్కి తీసుకుంది.
దీని వల్ల బంగ్లాదేశ్‌కి ఇకపై భారత రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు వాడుకునే అవకాశం ఉండదు.
ప్రస్తుతం, ఈశాన్య రాష్ట్రాలు దేశ ఇతర ప్రాంతాలతో అనుసంధానాన్ని ప్రధానంగా ''సిలిగురి కారిడార్'' ద్వారానే కల్పించుకుంటున్నాయి.
ఇది ఒకే మార్గంగా ఉండటంతో దూరాలు ఎక్కువవుతూ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వివరాలు
నేపాల్, భూటాన్ మార్గాల్లో రైలు
బంగ్లాదేశ్ ద్వారా వెళ్లే మార్గం సులభంగా ఉండేదే కానీ, ప్రస్తుతం ఉన్న యూనస్ ప్రభుత్వం భారత అనుకూలంగా లేకపోవడంతో భారత్ ఈ ప్రాజెక్టులను నిలిపివేసిన పరిస్థితి ఏర్పడింది.
దీనికి ప్రత్యామ్నాయంగా భారత్ ఇప్పుడు నేపాల్, భూటాన్ మార్గాల్లో రైలు మార్గాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
ఈ మార్గాలపై దృష్టి పెడితే, సిలిగురి కారిడార్‌పై ఉన్న ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.