India-canada: కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం లేదు...కెనడాకు షాకిచ్చిన ఆ దేశ దర్యాప్తు సంస్థలు
కెనడా దర్యాప్తు సంస్థలు ఆ దేశానికే షాకిచ్చేలా ఇండియా పై నివేదికనిచ్చాయి. కెనడా ఎన్నికల్లో భారత్ అసలు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేస్తూ దర్యాప్తు సంస్థలు నివేదికలిచ్చాయి. దీంతో కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు అవాస్తమని తేలాయి. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యల వల్ల కెనడా-భారత్ మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి. కెనడాలో నిజ్జర్ హత్య పై ఢిల్లీ ప్రమేయం ఉందని కెనడా నిందించింది. అనంతరం కెనడా సర్కారు అక్కడ జరిగిన ఎన్నికల్లో భారత్ ప్రమేయం ఉందని, తమ ఎన్నికల వ్యవహారంలో భారత్ పరోక్షంగా జోక్యం చేసుకుంటుందని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అది మా విధానం కాదు: స్పష్టం చేసిన భారత్
అక్కడి విపక్షాలు కూడా కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయని ఆరోపించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించింది. దర్యాప్తులో భారత్ పేరును చేరుస్తూ ప్రధాని ట్రూడో నిర్ణయం తీసుకోగానే మరోసారి ఇరుదేశాల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. కెనడా చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఏ దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలోనైనా జోక్యం చేసుకోవడం భారత్ విధానం కాదని తేల్చి చెప్పింది. కాగా కెనడా ఏర్పాటు చేసిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ కూడా కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం లేదని, జోక్యం చేసుకున్నట్లు నిరూపించే ఎటువంటి ఆధారాలు గానీ లేవని నివేదిక ఇచ్చింది. దీంతో దర్యాప్తు సంస్థ ముందు జస్టిస్ ట్రూడో బుధవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు.