Page Loader
Israel-Hamas War: గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఐరాసలో భారత్ ఓటు 
Israel-Hamas War: గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఐరాసలో భారత్ ఓటు

Israel-Hamas War: గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఐరాసలో భారత్ ఓటు 

వ్రాసిన వారు Stalin
Dec 13, 2023
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజా(Gaza) వేదికగా భీకర యుద్ధం నడుస్తోంది. ఈ క్రమలో గాజాలో తక్షణ కాల్పుల విరమణ (ceasefire)తో పాటు బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్లపై ఐక్యరాజ్య సమితిలో తీర్మానం (UN resolution) ప్రవేశపెట్టారు. జనరల్ అసెంబ్లీలో ఈజిప్ట్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా భారత్ (India) ఓటు వేసింది. తీర్మానానికి అనుకూలంగా 153 దేశాలు ఓట్లు వేయగా.. 23 దేశాలు గైర్హాజరయ్యాయి. 10 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడి జరిగిందని, గాజాలో అపారమైన మానవతా సంక్షోభం ఉందని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతోందన్నారు.

గాజా

ఈ కష్ట సమాయాల్లో అదే పెద్ద సవాలు: కాంబోజ్ 

జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసిందని కాంబోజ్ తెలిపారు. గాజా ప్రాంతం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించడానికి ఉమ్మడి కార్యచరణను రూపొందించేందుకు అంతర్జాతీయ సమాజం చేస్తున్న కృషిని భారతదేశం స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ క్లిష్ట సమయాల్లో సరైన సమతుల్యతను సాధించడమే అతిపెద్ద సవాలుగా మారిందన్నారు. ఇదిలా ఉంటే, ఈజిప్ట్ తీర్మానానికి చేసిన సవరణలతో అమెరికా ప్రవేశపెట్టిన ముసాయిదా ఐరాస జనరల్ అసెంబ్లీలో ఆమోదానికి నోచుకోలేదు. కనీసం 84 దేశాలు సవరణకు అనుకూలంగా ఓటు వేశాయి. 62 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 25 దేశాలు గైర్హాజరయ్యాయి.