
India-China: చైనా పౌరులకు పర్యాటక వీసాలు జారీ ప్రక్రియ పునఃప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
కొవిడ్, గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గతంలో భారత్, చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని భారత ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ ఇటీవల రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఐదు సంవత్సరాల విరామం తర్వాత భారత ప్రభుత్వం చైనా పౌరులకు టూరిస్ట్ వీసాల జారీ ప్రక్రియను మళ్లీ ప్రారంభించనుంది. ఈ విషయాన్ని చైనాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. జూలై 24వ తేదీ నుంచి చైనా పౌరులకు పర్యాటక వీసాలు మంజూరు చేయనున్నట్లు కార్యాలయం ప్రకటించింది.
వివరాలు
చైనా పౌరులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాల సస్పెండ్
2020 ప్రారంభంలో కరోనా వైరస్ ప్రభావంతో చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న సుమారు 22,000 మంది భారత విద్యార్థులు భారత్‌కు తిరిగి వచ్చారు. ఆ తరువాత, వారు మళ్లీ చైనాకు వెళ్లి భౌతిక తరగతులకు హాజరవ్వాలనే అభ్యర్థన చేసినా,రెండు సంవత్సరాల పాటు చైనా ప్రభుత్వం వారిని తిరిగి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో భారత ప్రభుత్వం పలు మార్లు చైనా అధికారులతో సంప్రదింపులు చేసినప్పటికీ, చైనా స్పందించకపోవడంతో 2022లో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) ద్వారా ఓ సర్క్యులర్ విడుదల చేస్తూ, చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని సస్పెండ్ చేసింది.
వివరాలు
పలు ఒప్పందాలు చేసుకున్నఇరుదేశాలు
కొవిడ్-19, గల్వాన్ సంఘటనల నేపథ్యంలో భారత్-చైనాల మధ్య పలు విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో రెండు దేశాల మధ్య నేరుగా నడిచే విమాన సేవలు కూడా నిలిపివేశారు. అయితే ఇటీవల లద్దాఖ్ సరిహద్దులో ఇద్దరు దేశాల బలగాలు వెనక్కి తీసుకోవడం, గస్తీల పునరుద్ధరణ, నేరుగా విమాన సేవలను తిరిగి ప్రారంభించాలనే ప్రయత్నాలు, అలాగే కైలాస మానససరోవర్ యాత్రను మళ్లీ ప్రారంభించే అంశాలపై రెండు దేశాలు కొన్ని కీలక ఒప్పందాలకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లారు.