Bristol Museum: బ్రిటన్‌లోని బ్రిస్టల్ మ్యూజియంలో భారీ చోరీ .. భారతీయ కళాఖండాలు మాయం!
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్‌లోని బ్రిస్టల్ నగరంలో ఉన్న ఒక మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది. దుండగులు 600కి పైగా అత్యంత విలువైన వస్తువులను తీసుకెళ్లారు.ఇందులో బ్రిటిష్ కాలానికి చెందిన కొన్ని అమూల్య భారతీయ కళాఖండాలూ ఉన్నాయి,ఇవి ప్రత్యేక గుర్తింపు పొందినవి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి,ప్రజల సహాయం కోరుతున్నారు. బ్రిస్టల్‌లోని బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ మ్యూజియంలో సెప్టెంబర్ 25న,తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల మధ్య ఈ దొంగతనం జరిగింది. చోరీ అయిన వస్తువులలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారికి సంబంధించిన నడుముపట్టీ బకిల్, దంతంతో తయారుచేసిన బుద్ధ విగ్రహం వంటి అమూల్య భారతీయ కళాఖండాలు ఉన్నాయి. ఈ కళాఖండాలు బ్రిటిష్ చరిత్రకు సంబంధించిన కీలక ఆధారాలని అధికారులు తెలిపారు.
వివరాలు
దర్యాప్తు చేపట్టి సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు
ఈ ఘటనపై ఎవాన్ & సోమర్‌సెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నలుగురు అనుమానితులు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా అధికారులు విడుదల చేశారు. ఈ కేసును విచారిస్తున్న డిటెక్టివ్ కానిస్టేబుల్ డాన్ బర్గన్ మాట్లాడుతూ.. "సాంస్కృతికంగా అత్యంత విలువైన ఈ వస్తువుల చోరీ నగరానికి గణనీయమైన నష్టం కలిగించింది. వీటిలో ఎక్కువ సంఖ్యలో విరాళంగా వచ్చిన వస్తువులు కూడా ఉన్నాయి. నిందితులను పట్టుకోవడానికి ప్రజల సహకారం అవసరం" అని తెలిపారు. ఘటన జరగిన రెండు నెలల తర్వాత పోలీసులు ఈ సమాచారాన్ని వెల్లడించడం, ప్రజల సహాయాన్ని కోరడం, చర్చనీయాంశంగా మారింది. ఫోరెన్సిక్ సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ఇంకా కొనసాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బ్రిటన్‌లోని బ్రిస్టల్ మ్యూజియంలో భారీ చోరీ
More than 600 British Empire-era artefacts stolen from Bristol Museum https://t.co/IQiz5PGa7f pic.twitter.com/8mfmh7f89m
— Al Jazeera English (@AJEnglish) December 11, 2025