Toronto: కెనడాలోని టొరంటోలో దాడులు.. కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్
భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు ఉద్రిక్తతలకు లోనవుతున్న నేపథ్యంలో, కెనడాలో ఇటీవల జరిగిన ఒక ఆలయంపై దాడి తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ నేపథ్యంలో భారత్ ఓ కీలక నిర్ణయం తీసుకుంటూ, భద్రతా కారణాలతో కెనడాలోని కాన్సులర్ క్యాంప్‌లను రద్దు చేయాలని ప్రకటించింది. ఈ మేరకు, టొరంటోలోని భారత కాన్సులేట్ 'ఎక్స్' వేదికగా అధికారికంగా ప్రకటన జారీ చేసింది.
కాన్సులర్ క్యాంప్‌పై దాడి
''కమ్యూనిటీ క్యాంప్‌ల నిర్వహణకు కనీస భద్రతను కల్పించలేమని'' భద్రతా ఏజెన్సీలు తెలిపాయి. దీంతో, ''మా షెడ్యూల్ కాన్సులర్ క్యాంప్‌లను రద్దు చేయాలని నిర్ణయించామని'' భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇటీవల బ్రాంప్టన్‌లోని హిందూసభ దేవాలయ ప్రాంగణంలో జరిగిన కాన్సులర్ క్యాంప్‌పై కొంతమంది సిక్కు వేర్పాటువాదులు దాడి చేశారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వీరులు ఖలిస్థానీ జెండాలతో ప్రదర్శన చేసి, భక్తులపై దాడులు చేశారు. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.
కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం: నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందిస్తూ, ''కెనడాలో హిందూ ఆలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని తివ్రంగా ఖండిస్తున్నాను. మన దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపందుల ప్రయత్నాలు కూడా అంతే దారుణమైనవి. ఇలాంటి హింసాత్మక చర్యలు భారతదేశం దృఢనిశ్చయాన్ని బలహీనపరచలేవు. కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని, చట్టబద్ధమైన పాలనను కాపాడుతుందని మేము ఆశిస్తున్నాము'' అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.